
సాక్షి, రాజమహేంద్రవరం: అభివృద్ధి పనుల్లో భాగంగా నష్టపోతున్న ప్రజలకు నష్ట పరిహారం చెల్లించే చర్యలు చేపట్టాల్సిన ప్రజా ప్రతినిధులు తమ రాజకీయ అనుభవాన్నంతా రంగరించి సరికొత్త డ్రామాలకు తెరదీస్తున్నారు. ఓ పక్క రోడ్డు విస్తరణకు అధికారుల వద్ద సమ్మతం వ్యక్తం చేసి, కట్టడాలు తొలగించే సమయంలో మాత్రం ప్రజలల్లో వ్యతిరేకత రాకుండా తొలగించడానికి వీలు లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ వ్యవరిస్తున్న తీరును అర్థం చేసుకుంటున్న ప్రజలు, అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. మధురపూడి విమానాశ్రయ రోడ్డులో దోసకాయలపల్లి గ్రామంలో కొద్దిమేర రోడ్డు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు.
ఈ నెల 19 నుంచి 21 తేదీ వరకు కాకినాడ బీచ్ ఫెస్టివల్ నేపథ్యంలో వీఐపీలు, రాజకీయ నేతల కాన్వాయ్ రాకపోకలకు అడ్డంకి లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జారీ చేసిన ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ సాయికాంత్ వర్మ చర్యలు చేపట్టారు. ముందుగా ఈ విషయం రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే పెందుర్తి వెకంటేష్‌తో చర్చించారు. అందుకు ఆయన సమ్మతించారు. అనంతరం దోసకాయలపల్లిలో సర్వే చేయించారు. రోడ్డు విస్తరించాల్సిన ప్రాంతంలో 63 గృహాలను తొలగించాల్సిన పరిస్థితి. ఈ సమయంలోనే ఎమ్మెల్యే పెందుర్తి తనలోని రాజకీయ నాయకుడిని నిద్రలేపారు. ఒక్కసారిగా విస్తరణ పనులు వద్దకు వచ్చి ‘చేయడానికి వీలు లేదంటూ’ చిందులేశారు. ఎలా చేస్తారోనంటూ సబ్‌కలెక్టర్ సాయికాంత్ వర్మపై ఫైర్ అయ్యారు. తమ ఎమ్మెల్యే తమకు అండగా ఉంటున్నారని బాధితులు సంబరపడ్డారు. ఈ సంతోషం కొద్దిసేపు కూడా నిలబడలేదు. పనులు ఎలా చేస్తారో చూస్తానన్న ఎమ్మెల్యే ఆనక చిన్నగా స్వరం మార్చి క్రిస్మస్ పండగ దాకా ఆగండంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సీతానగరంలోనూ ఇదే తీరు..
ఇరుకైన రోడ్డులో ఇసుక లారీల రాకపోకల వల్ల సీతానగరం మండలంలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 8 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు. కారణాలను విశ్లేషించిన నూతన సబ్‌కలెక్టర్ సాయికాంత్ వర్మ రోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు రోడ్డు, భవనాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముగ్గళ్ల నుంచి సీతానగరం వరకు రోడ్డు సర్వే 15 రోజుల కిందట పూర్తి చేశారు. అయితే సీతానగరంలో రోడ్డువైపున ఉన్న తన అనుచరుల స్థలాలు, ఆస్తులు కొంత మేర కొల్పోయే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యే పెందుర్తి రోడ్డు విస్తరణను వ్యతిరేకిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనుల కోసం బాధితులకు ఉపసమన చర్యలు చేపట్టి ఒప్పించాల్సిన ప్రజా ప్రతినిధి ఇలా వ్యవహరిస్తుండడంతో అధికారులు అవాక్కవుతున్నారు. పని చేయాలని తపన ఉన్నా నియోజకవర్గ ప్రజా ప్రతినిధే సహకరించకపోతుండడంతో ఉన్నతాధికారులు మిన్నకుండిపోతున్నారు.
మాటల మర్మం తెలిసి అవాక్కైన ప్రజలు
సబ్‌కలెక్టర్ వద్ద రోడ్డు విస్తరణకు ఒప్పుకుని, ప్రజల వద్దకు వచ్చి పనులు చేయడానికి వీలు లేదని, ఆ తర్వాత కొద్దిసేపటికే పండగ వరకూ ఆగండిని.. ఇలా రెండు రకాల మాటలు మాట్లాడడాన్ని ప్రజలు నిదానంగా పసిగట్టారు. పండుగ వరకు ఆగండి అంటే ఆ తర్వాత రోడ్డు విస్తరణ చేయమనే కదా అన్న విషయం అర్ధం కావడంతో తమ ఎమ్మెల్యే తెలివి తేటలను గుర్తు చేసుకుని విస్తుబోతున్నారు. ఇల్లు కోల్పోతున్న 63 మందికి నూతన ఇళ్లు కట్టించి ఇవ్వడం, అప్పటి వరకు తాత్కాలికంగా ఉపశమన చర్యలు చేపట్టే విధంగా అధికారులతో మాట్లాడే అవకాశం ఉన్నా ఎమ్మెల్యే ఆ దిశగా ఆలోచించకపోడం గమనార్హం. ప్రతిపక్ష పార్టీలు బాధితులకు నష్టపరిహారం, లేదా ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ ఆ డిమాండ్లను నెరేవేర్చ గలిగే అవకాశం ఉన్న అధికారపార్టీ ఎమ్మెల్యే ప్రజలను మోసగించే చర్యలపై స్థానికులు మండిపడుతున్నారు. తమ నాయకుడు వ్యవహరిస్తున్న తీరుతో ఆయన అనుచరులు కూడా విస్తుబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment