టీడీపీ తీరుపై కేంద్రం సిగ్గుపడుతోంది
► ఎమ్మెల్యేలను కొనుక్కోవడమేనా ప్రజాస్వామ్యం...
► వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల ఆరోపణ
► సేవ్‌డెమొక్రసీ కోసం గడపగడపకు యాత్రలు చేపడతామని వెల్లడి
గోపాలపట్నం : టీడీపీ అధినేత చంద్రబాబు అప్రజాస్వామ్య పాలనపై కేంద్రం సిగ్గుపడుతోందని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు డబ్బు ఎరజూపి కొనుక్కోవడం, అభివృద్ధిని గాలికొదిలేయడం ప్రజాస్వామ్యమా అని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, గిడ్డి ఈశ్వరి, దాడిశెట్టి రాజా, కళావతి, కంబాల జోగులు, పుష్ప శ్రీవాణి ఢిల్లీలో ‘సేవ్‌డెమొక్రసీ’ యాత్ర ముగించుకొని విశాఖ విమానాశ్రయానికి గురువారం సాయంత్రం చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రలో అధికార పార్టీ తీరుపై కేంద్రం ఎంత చిన్నచూపుతో ఉందో వివరించారు. టీడీపీ చర్యలను నిరసిస్తూ.. వైఎస్సార్ సీపీ చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు.
అడ్డగోలు సంపాదనతో ఎమ్మెల్యేలను కొంటున్నారు
పట్టిసీమ, రాజధాని భూములపై అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ లేదు. నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదు. ఇది అత్యంత దారుణం. ఒక పార్టీ బీఫాంతో గెలిచిన ఎమ్మెల్యేలను మరో పార్టీ వారు కొనడం రాక్షసపాలనగానే భావిస్తున్నాం. టీడీపీ ప్రభుత్వ ఆగడాలపై పుస్తకరూపంలో కేంద్రానికి విన్నవించాం. టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ భృతి ఎరజూపి ఓట్లేయించుకని ఇపుడు మొహం చాటేసింది. ఫీజు రీయింబర్సుమెంట్ మంజూరు చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వలేదని వాపోయారు. ప్రజలు వైఎస్సార్ సీపీ పక్షాన ఉన్నారు. వైఎస్సార్ సీపీ పోరు ఇది ఆరంభమే. - బూడి ముత్యాలనాయుడు, మాడుగుల ఎమ్మెల్యే
కిడారిని రూ. 30 కోట్లతో కొన్నారు
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.30 కోట్లిచ్చి కొన్నారు. కిడారి సర్వేశ్వరరావు వైఎస్సార్ సీపీకి నమ్మకద్రోహం చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి వెన్నుపోటుపొడిచారు. కొణతాల రామకృష్ణను గురువంటునే ఆయనకు భంగపాటుకు గురిచేశారు. కిడారి స్వలాభం కోసం గిరిజనులను టీడీపీకి తాకట్టుపెట్టారు. గిరిజనులు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై అభిమానంతో జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం కోరుతూ ఓట్లేస్తే ఇలా పార్టీ ఫిరాయించారు. ఏజెన్సీలో 50 ఎకరాల మైనింగ్ దోచుకోడానికి కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరడం దారుణం. పార్టీ ఫిరాయింపులపై జాతీయ నాయకులను, ప్రధాన పార్టీల నాయకులను కలిసి అన్నివిషయాలు చర్చించాం. టీడీపీ చర్యలు హాస్యాస్పదమని కేంద్రంలో నాయకులు విమర్శిస్తున్నారు. - గిడ్డి ఈశ్వరి, పాడేరు ఎమ్మెల్యే