అది విభజన కూటమి.. | TDP party excepted state bifurcation | Sakshi
Sakshi News home page

అది విభజన కూటమి..

Published Mon, Apr 7 2014 4:33 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

అది విభజన కూటమి.. - Sakshi

అది విభజన కూటమి..

 ‘ఛీ.. పొమ్మ’న్నా కాళ్లా వేళ్లా పడి పొత్తు పెట్టుకుంటున్నారు
 బాబు పాలనలో 100 తప్పులు అంటూ బీజేపీ చార్జ్‌షీట్ గుర్తులేదా?
  వై ఎస్సార్ కాంగ్రెస్‌ను ఓడించాలనుకోవడం కలే.. అది నిజం కాదు
 ఇది చారిత్రక పొత్తు కాదు.. చరిత్రహీనమైన పొత్తు.. చారిత్రక తప్పిదం
 
 జగన్‌ను ఎదుర్కోలేకే బీజేపీతో చంద్రబాబు పొత్తు: ఉమ్మారెడ్డి
 సాక్షి, హైదరాబాద్: టీడీపీ-బీజేపీలది విభజన కూటమి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభివర్ణించారు. ‘‘రాష్ట్ర విభజనకు టీడీపీ ఒప్పుకుంది. బీజేపీ కూడా అనుకూలంగా ఓటేసింది. ఇరు పక్షాలూ రాష్ట్ర విభజనలో భాగస్వామ్యులయ్యారు’’ అని ఆయన ధ్వజమెత్తారు. రెండు పార్టీలూ కేంద్రంలోని కాంగ్రెస్‌కు మద్దతిచ్చినట్టు రూఢీ అయిందని, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ ఒకే దగ్గరకు వచ్చాయని విమర్శించారు.
 
 రాష్ట్ర విభజనకు దోహదపడిన చంద్రబాబుకు.. ఇటీవల జనసేన పార్టీని స్థాపించిన సినీ నటుడు పవన్‌కల్యాణ్ మద్దతిచ్చారంటే ఆయన కూడా విభజన వాదేనని వ్యాఖ్యానించారు. ఒకవైపు బీజేపీతో పొత్తు, మరోవైపు కాంగ్రెస్‌తో కాపురం చేస్తూ ఎన్ని జిత్తులు చేసినా టీడీపీకి ఓటమి ఖాయమన్నారు. ఉమ్మారెడ్డి ఆదివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ బలహీనపడిన కారణంగానే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అందరి కాళ్లూ పట్టుకుంటున్నారని.. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమని తెలిసే.. బీజేపీ ‘ఛీ.. పొ’మ్మన్నా కాళ్లా వేళ్లా పడి ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంతో పాలు పంచుకునేందుకే చంద్రబాబు బీజేపీతో పొత్తుపెట్టుకుంటున్నారని విమర్శించారు.
 
 బాబుపై బీజేపీ చార్జ్‌షీట్‌ను మర్చిపోయారా?
 టీడీపీ, బీజేపీల మధ్య సంబంధాలు, సంభాషణలను గుర్తుచేసుకుంటే.. ఆ రెండింటి మధ్య పొత్తు చారిత్రక పొత్తా? చరిత్ర హీనమైన పొత్తా? అనేది అవగతమవుతుందని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ 1997లో కాకినాడ తీర్మానాన్ని గుర్తుచేస్తూ.. ఒక్క ఓటు - రెండు రాష్ట్రాలు అనే నినాదం.. ఎలా వచ్చిందో టీడీపీ, బీజేపీలు ఆలోచించుకోవాలన్నారు. 1998లో బాబు పరిపాలనలో వంద తప్పులు అంటూ బీజేపీ చార్జిషీట్ వేసిన విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు. ‘‘ఢిల్లీలో వియ్యం - హైదరాబాద్‌లో కయ్యం.. అక్కడ కో-ఆపరేషన్ - ఇక్కడ ఆపరేషన్.. ఢిల్లీలో ప్రేమ - గల్లీలో డ్రామా.. ఇదేం హైటెక్ పోకడ అని అప్పట్లో అన్న మాటల్ని ఇప్పుడు ఇరుపక్షాల నేతలూ అంగీకరిస్తారా?’’ అని ఆయన ప్రశ్నించారు.
 
 నాడు మోడీని నరహంతకుడన్నారు కదా?
 గుజరాత్ అల్లర్ల సమయంలో మోడీ హైదరాబాద్ వస్తే అడ్డుకుంటామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు హైదరాబాద్ వస్తే స్వాగతిస్తానని చెప్పడం ఎంతవరకు సబబు అని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. ‘‘బీజేపీ అంటరాని పార్టీగా తేల్చి, మోడి నరహంతకుడు అని, ఆయనకు ఎలాంటి అర్హతలేదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో పొత్తుకు సిద్ధమవటం ఏ విధమైన నైతికం’’ అని నిలదీశారు. ఇది చారిత్రక తప్పిదమన్నారు. తనకు వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్‌లు పోటీయే కాదని చెప్పిన చంద్రబాబుకు ఇప్పుడు బీజేపీలో ఉన్న అదనపు అర్హతలేమిటో చెప్పాలన్నారు. మైనారిటీలు, సమైక్యవాదులకు దూరమయ్యేందుకు తప్పితే ఎన్నికల్లో గెలిచేందుకు ఈ పొత్తు ఉపయోగపడదన్నారు.
 
 బాబు నమ్మకద్రోహాన్ని జనం గ్రహించారు
 ఎన్ని ఎత్తులు వేసినా టీడీపీ వైఫల్యాలను, చేసిన నమ్మకద్రోహాన్ని ప్రజలు గ్రహించారని ఆయన పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో జగన్‌ను వ్యతిరేకించి గెలవడ ం బాబుకు సాధ్యం కాదు కనుకే పొత్తుల వెంట వెళ్తున్నారని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. జనం నాడి ఎలా ఉందో అందరికీ తెలుసునని, ైవె ఎస్సార్ సీపీని ఓడించాలనుకోవడం కలేనని, అది వాస్తవ రూపం దాల్చదని స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని ఆయన స్పష్టంచేశారు.

 టీడీపీతో దోస్తీ చరిత్ర మర్చిపోయారా?
 చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్లే తాము పాడైపోయామని 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నేతలు చెప్పిన విషయాన్ని ఉమ్మారెడ్డి గుర్తుచేశారు. 2004 ఎన్నికల్లో బీజేపీ నేతలు కూడా అదే తేల్చారంటూ.. చరిత్ర మర్చిపోయారా అని ప్రశ్నించారు. బాబుకు ఒక విధానమంటూ ఏమీ లేదన్నారు. టీడీపీలో ముస్లింలకు స్థానం లేకుండా పోయిందం టూ 2009లో హిందూ పత్రికలో వచ్చిన కథనాన్ని గుర్తుచేశారు. చంద్రబాబుతో పొత్తు ఇష్టం లేక వివిధ జిల్లాల బీజేపీ నేతలు రెండు రోజుల క్రితం మూకుమ్మడిగా తీర్మానాలు చేయడం గుర్తుచేసుకోవాలని ఉమ్మారెడ్డి అన్నారు.
 
 2004లో తాము నష్టపోయిన విషయాన్ని పేర్కొంటూ బీజేపీ నేత జవదేకర్‌కు కూడా విన్నవించారన్నారు. ఈ నేపథ్యంలో తాను ఈ ఎన్నికల్లో పోటీకి దూరమని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పడాన్ని బట్టి పరిస్థితిపై ఆలోచించుకోవాలని సూచించారు. అపవిత్ర, అనైతిక కలయికను ప్రజలు కూడా హర్షించరన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement