సాక్షి ప్రతినిధి, అనంతపురం : ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య రగలిన చిచ్చు కార్చిచ్చుగా మారింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించారని వరదాపురం సూరి ఒకవైపు చెబుతుండగా... తనకు టికెట్ దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ఖాయమని గోనుగుంట్ల విజయ్‌కుమార్ మరోవైపు కుండబద్దలు కొడుతున్నారు. ఈ క్రమంలోనే బల సమీకరణలో గోనుగుంట్ల విజయ్‌కుమార్ నిమగ్నమవడం టీడీపీలో వర్గ విభేదాలను మరింత రాజేస్తోంది. వరదాపురం సూరి ఆది నుంచి పరిటాల రవితో విభేదిస్తూ వచ్చారు.
2004లో ధర్మవరం టీడీపీ టికెట్ కోసం వరదాపురం పోటీపడ్డారు. పరిటాల రవి మోకాలడ్డడంతో టికెట్ చేజారింది. 2009లోనూ టికెట్ ఆశించారు. అయితే...టీడీపీ, వామపక్షాల పొత్తులో భాగంగా ధర్మవరం స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. దాంతో సూరి రెబల్ అభ్యర్థిగా పోటీ చేశారు. పొత్తు ధర్మాన్ని విస్మరించి సూరికే టీడీపీ బాహటంగా మద్దతు తెలపడంపై అప్పట్లో సీపీఐ నేతలు దుమ్మెత్తిపోశారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వరదాపురం సూరిని ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు.
దీన్ని అప్పట్లో పరిటాల సునీత వ్యతిరేకించారు. అలాగే ధర్మవరం నియోజకవర్గంలోని పరిటాల రవి వర్గీయులను సూరికి వ్యతిరేకంగా రెచ్చగొడుతూ వచ్చారు. తన నియోజకవర్గంలో సునీత తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతోండటంతో వరదాపురం కూడా రాప్తాడు నియోజకవర్గంపై కన్నేశారు. ఆ నియోజకవర్గంలో సునీత వ్యతిరేక వర్గీయులకు దన్నుగా నిలుస్తూ విందు రాజకీయాలు నడిపారు. ఇది ఇరు వర్గాల మధ్య తీవ్ర విభేదాలకు దారితీసింది. రెండేళ్ల క్రితం మామిళ్లపల్లి వద్ద జరిగిన త్రిబుల్ మర్డర్ విషయంపై ధర్నా చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ధర్మవరానికి వచ్చిన సమయంలో ఆ పార్టీ అభ్యర్థిగా వరదాపురం సూరిని ప్రకటించారు.
దీన్ని అప్పుడే పరిటాల వర్గీయులు వ్యతిరేకించారు. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల విజయమ్మ కుమారుడు విజయ్‌కుమార్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ చిగిచెర్ల ఓబిరెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ సూరి వ్యతిరేక వర్గీయులను సమైక్య పరుస్తూ వస్తున్నారు. వీరిద్దరికీ పరిటాల సునీత బాహటంగా మద్దతు తెలుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తోన్న నేపథ్యంలో సూరి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆయనకు పోటీగా గోనుగుంట్ల విజయ్‌కుమార్ బృందం కూడా పర్యటిస్తోంది. ఇదే అంశంపై టీడీపీ జిల్లా ఇన్‌చార్జ్ సీఎం రమేష్‌కు సూరి ఫిర్యాదు చేశారు.
సునీత తనకు వ్యతిరేకంగా విజయ్‌కుమార్ బృందాన్ని రెచ్చగొడుతున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. సీఎం రమేష్ ఇదే అంశంపై సునీతను ప్రశ్నించినట్లు సమాచారం. ధర్మవరం టికెట్ సూరికి ఇస్తే ఓడిపోవడం ఖాయమని, విజయ్‌కుమార్‌కే ఇవ్వాలని సునీత సూచించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని ఇటీవల చంద్రబాబు వద్ద కూడా ఆమె ప్రస్తావించినట్లు చెబుతున్నారు. విజయ్‌కుమార్‌కు టికెట్ ఇచ్చే అంశంపై చంద్రబాబు ఎటూ తేల్చలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల షెడ్యూలు వెలువడేలోగా సూరిని వ్యతిరేకించే నాయకులను సమీకరించి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లడానికి విజయ్‌కుమార్ ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే ఇటీవల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు వద్ద బలనిరూపణ చేసిన తర్వాత కూడా తనను కాదని సూరికే టికెట్ ఇస్తే.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని విజయ్‌కుమార్ సన్నిహితుల వద్ద స్పష్టీకరిస్తున్నారు.
‘తమ్ముళ్ల’ టికెట్ రగడ
Published Mon, Feb 24 2014 2:56 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement