రెండు వర్గాల ఘర్షణకు రాజకీయ రంగు! | TDP Plan to cover up Yarapatineni and Kodela irregularities | Sakshi
Sakshi News home page

రెండు వర్గాల ఘర్షణకు రాజకీయ రంగు!

Published Wed, Sep 11 2019 5:47 AM | Last Updated on Wed, Sep 11 2019 5:47 AM

TDP Plan to cover up Yarapatineni and Kodela irregularities - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉద్యోగాల విప్లవం, వరుసగా పలు సంక్షేమ పథకాల అమలుతో ప్రభుత్వానికి లభిస్తున్న ఆదరణతో ఆందోళన చెందుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు దీని నుంచి జనం దృష్టి మళ్లించడమే లక్ష్యంగా పల్నాడు ముసుగులో రాజకీయ క్రీడకు తెరతీశారు. పల్నాడును అక్రమ మైనింగ్‌తో కబళించిన యరపతినేని శ్రీనివాసరావు, కుటుంబంతో కలసి అధికార దుర్వినియోగానికి పాల్పడిన కోడెల శివప్రసాదరావు అక్రమాలపై ఐదేళ్లలో ఏనాడూ నోరు మెదపకుండా ఇప్పుడు ఓ  గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణను చంద్రబాబు భూతద్దంలో చూపుతూ నానా రభస సృష్టిస్తున్నారు. 

పునరావాసానికి టీడీపీలోనే మద్దతు కరువు
తన హయాంలో పల్నాడులో జరిగిన అరాచకాలను మరచిపోయి వైఎస్సార్‌సీపీ బాధితుల పునరావాస కేంద్రం పేరుతో చంద్రబాబు ప్రారంభించిన నాటకానికి సొంత పార్టీలోనే మద్దతు కరువవడం గమనార్హం. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలను శాంతి భద్రతల సమస్యగా, కక్ష సాధింపుగా చిత్రీకరిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు వారం నుంచి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పునరావాస కేంద్రం ఏర్పాటును టీడీపీ నాయకులే పట్టించుకోలేదు. చంద్రబాబు రాద్ధాంతానికి ఎంచుకున్న ఆత్మకూరు గ్రామం గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉండగా అక్కడి నుంచి బాధితుల పేరుతో కొందరిని పునరావాస కేంద్రంలో ఉంచారు. మాచర్లలో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన అంజిరెడ్డి ఇంతవరకూ ఆ కేంద్రం ఛాయలకే రాలేదు. టీడీపీ అధికారంలో ఉండగా గురజాలతోపాటు మాచర్ల నియోజకవర్గాల్లో దౌర్జన్యాలు సాగించిన యరపతినేని శ్రీనివాసరావు చివరిరోజు వరకూ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. చంద్రబాబు ఒత్తిడితో మంగళవారం బలవంతంగా అక్కడకు వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కూడా దీన్ని పట్టించుకోకపోగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ తదితరులు అంటీముట్టనట్టు వ్యవహరించారు.  పల్నాడు పేరుతో హంగామా చేసినా ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకులే ఈ తంతుకు తూతూమంత్రంగా హాజరవటాన్ని బట్టి ఇదంతా చంద్రబాబు మంత్రాంగమేనని స్పష్టమవుతోంది. 

యరపతినేని, కోడెల దురాగతాలను కప్పిపుచ్చే యత్నం
గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు, సచివాలయాల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగ నియామకాలు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఒక్క రిమార్కు కూడా లేకుండా 20 లక్షల మంది అభ్యర్థులకు విజయవంతంగా పరీక్షలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వంపై యువతలో ఆదరణ మరింత పెరిగిన నేపథ్యంలో దానిపై చర్చ జరగకుండా చేసే దురుద్దేశంతో చంద్రబాబు ఈ రాద్ధాంతం మొదలుపెట్టారు. సంక్షేమ పథకాల ద్వారా ముందుకెళుతున్న ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడం, శాంతి భద్రతల సమస్యను సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు వైఎస్సార్‌సీపీ బాధితుల పునరావాస కేంద్రం పేరుతో హడావుడి చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే పల్నాడుకు చెందిన టీడీపీ నాయకులు ముందుకు రాకపోయినా  బాధితులున్నారంటూ హంగామా చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.  ఐదేళ్లు పల్నాడులో యరపతినేని శ్రీనివాసరావు చేసిన అరాచకాలపై చంద్రబాబు నోరు మెదపలేదు. అక్రమ మైనింగ్, పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని యరపతినేని చేసిన సెటిల్‌మెంట్లు, దందాలకు చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి లోకేష్‌ అండగా నిలిచారు. యరపతినేని అక్రమ మైనింగ్‌ను కోర్టు తప్పు పట్టగా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. మరోవైపు టీడీపీ హయాంలో స్పీకర్‌గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు, కుమార్తె సాగించిన దౌర్జన్యాలపై బాధితులు పోలీస్‌ స్టేషన్లకు క్యూ కట్టిన విషయం తెలిసిందే. వీటన్నింటిపై మౌనముద్ర వహించిన చంద్రబాబు పల్నాడులో ఏదో జరిగిపోయిందని దుష్ప్రచారం చేయడం ద్వారా తమ పార్టీ నేతల దురాగతాలను కప్పిపెట్టే వ్యూహం కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

బురద చల్లడమే లక్ష్యం
శాంతిభద్రతల సమస్య ఉందని తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వంపై బురద జల్లడం, యరపతినేని, కోడెల తదితరుల అరాచకాలను కప్పి పుచ్చడం, సంక్షేమ కార్యక్రమాలపై చర్చ జరగకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా చంద్రబాబు ఇప్పుడు చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గుంటూరులో ఏర్పాటుచేసిన బాధితుల పునరావాస కేంద్రానికి తరలించిన వారిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో కొందరు పెయిడ్‌ ఆర్టిస్టులను తీసుకొచ్చారని, టీడీపీ నేత జీవీ ఆంజనేయులు రోజుకు రూ.7 వేల చొప్పున ఇచ్చి కొందరిని బాధితులుగా చూపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.  

నేతల గృహ నిర్బంధం
వైఎస్సార్‌సీపీ, టీడీపీ చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో ఇరు పార్టీల నేతలను పోలీసులు గృహ నిర్భంధం చేస్తున్నారు. జిల్లాల నుంచి గుంటూరుకు బయలుదేరిన నాయకులను పోలీసులు మంగళవారం సాయంత్రం నుంచే ఎక్కడికక్కడ నిలిపివేయడం ప్రారంభించారు. చలో ఆత్మకూరుకు అనుమతి లేదని ప్రకటించిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఎవరూ ఈ కార్యక్రమానికి రావద్దని స్పష్టం చేశారు. అయినా పలు జిల్లాల నుంచి వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులు  ఆత్మకూరుకు బయలుదేరుతున్నారనే సమాచారంతో  పోలీసులు చర్యలు చేపట్టారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement