ఇసుక మాఫీయాతో టీడీపీకి ముప్పు
హెచ్చరించిన పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు
నిరుత్సాహంగా పార్టీ జిల్లా సమావేశం
ఏలూరు సిటీ : జిల్లాలో ఇసుక మాఫియాను అరికట్టకుంటే టీడీపీ తీవ్ర ముప్పు తప్పదని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, జెడ్పీటీసీలు జిల్లా విస్త్రతస్థాయి సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. పైగా తమకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ద్వితీయశ్రేణి నాయకులు వాపోయారు. ఏలూరు అమీనాపేటలోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి రాజ్యసభ సభ్యురాలు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతా రామలక్ష్మి అధ్యక్షత వహించారు. తొలుత వేదికపై పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభించాల్సిన సమావేశాన్ని ఆల స్యంగా 12గంటలకు ప్రారంభించారు. జిల్లాలోని పార్టీ ప్రముఖ ప్రజాప్రతినిధులు పెద్దగా హాజరుకాకపోవటంతో గంటన్నరలోనే సమావేశాన్ని ముగించారు. సమావేశానికి ఎమ్మెల్సీ షరీఫ్, విప్ అంగర రామ్మోహన్‌రావు, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, గన్ని వీరాంజనేయులు, మొడియం శ్రీనివాస్, వేటుకూరి శివరామరాజు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక, జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగిరెడ్ల మేఘలాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పాల జగదీష్‌బాబు, జిల్లా సమన్వయ కర్త పాలి ప్రసాద్, తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ మాత్రమే హాజరయ్యారు.
బయటపడిన విభేదాలు
సమావేశం ఆరంభంలోనే ఏలూరు ఎంపీ మాగంటి బాబు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలంటూ మాట్లాడడం ఆరంభించటంతో జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి వారించే ప్రయత్నం చేశారు. అయినా పట్టించుకోకుండా బాబు తన ఆవేదనంతా వెళ్లగక్కారు. ఎంపీగా తనకు గౌరవం ఇవ్వటంలేదని, పార్టీ కోసం పనిచేసే నాయకులకు పదవులైనా ఇవ్వకపోతే ఎలా పనిచేస్తారంటూ ప్రశ్నించారు. సమావేశం మధ్యలో మంత్రి పీతల సుజాత వేదికపైకి రావటంతో వెంటనే అక్కడి నుంచి ఎంపీ మాగంటి బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఎప్పటి నుంచో మంత్రి, ఎంపీ మధ్య ఉన్న విభేదాలు ఈ ఘటనతో మరోసారి బయటపడ్డాయి.
సీఎం చంద్రబాబుకే సాధ్యం
సమావేశంలో సీతా రామలక్ష్మి, మంత్రి సుజాత మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఏపీని సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమే గట్టెక్కించగలరని అన్నారు. పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. 18 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు రూ.522 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించామన్నారు. జన్మభూమి కమిటీలు పారదర్శకంగా పార్టీకి పేరు తెచ్చేలా పనిచేయాలన్నారు.
ఇసుక మాఫియాతో ముప్పు
తణుకు జెడ్పీటీసీ సభ్యుడు ఆత్మకూరి బులిరాజు, తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి వంక సోమచంద్రరావు, పార్టీ నాయకులు బడుగు వెంకటేశ్వరరావు, పెంటపాడు కో ఆపరేటివ్ బ్యాంకు డెరైక్టర్ దాసరి అప్పన్న, వీరవాసరానికి చెందిన వీరవల్లి చంద్రశేఖర్ ఇసుక మాఫియా వల్ల పార్టీ పరిస్థితి బాగాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా పలు అంశాలపై పార్టీ తీరును ఎండగట్టారు. ఇంకా నిడదవోలుకు చెందిన రోకలపూడి వీరవెంకట సత్యనారాయణ, రాష్ట్ర మహిళ సభ్యురాలు అక్కిన నాగమణి, జిల్లా పరిశీలకులు ఎండీ నజీర్, నాయుడు రామచంద్రరావు, పెచ్చేటి విజయలక్ష్మి, తదితరులు తమ ఆవేదన వెళ్లగక్కారు.