టీడీపీ విజయభేరి | TDP sucessful in elections 2014 | Sakshi
Sakshi News home page

టీడీపీ విజయభేరి

Published Sat, May 17 2014 1:47 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

టీడీపీ విజయభేరి - Sakshi

టీడీపీ విజయభేరి

సాక్షి ప్రతినిధి, అనంతపురం : నరేంద్రమోడీ ప్రభంజనంతో టీడీపీ జయకేతనం ఎగుర వేసింది. పంట రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీకి గ్రామీణ ఓటర్లు పట్టం కట్టారు. ఫలితంగా జిల్లాలో రెండు లోక్‌సభ, 12 శాసనసభ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఉరవకొండ, కదిరి స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు.
 
 గుంతకల్లులో టీడీపీ శ్రేణులు సహాయ నిరాకరణ చేయడంతో బీజేపీ అభ్యర్థి వెంకట్రామయ్య డిపాజిట్ గల్లంతయ్యింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌పై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవసానంగా ఆ పార్టీ జిల్లాలో పోటీ చేసిన 13 శాసనసభ, రెండు లోక్‌సభ స్థానాల్లో ఎక్కడా డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. చివరకు పెనుకొండ నుంచి పోటీ చేసిన ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సైతం డిపాజిట్ కోల్పోయారు. శింగనమల నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌దీ ఇదే పరిస్థితి. సార్వత్రిక ఎన్నికలకు ముందే దేశ వ్యాప్తంగా నరేంద్రమోడీ ప్రభంజనం మొదలైంది.
 
 మోడీ చరిష్మాతో విజయానికి బాటలు వేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం రచించారు. ఆ క్రమంలోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికల ప్రచారంలో పంట రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని.. ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని హామీల వర్షం కురిపించారు. అవి ఆచరణ సాధ్యం కావని ఆర్థిక నిపుణులు, చివరకు లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ కూడా స్పష్టీకరించారు. కానీ.. మోడీని ప్రధాని చేయాలన్న లక్ష్యంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఓటర్లు పట్టం కట్టారు. పంట రుణాల మాఫీపై బాబు ఇచ్చిన హామీ కూడా గ్రామీణ ఓటర్లను ఆకర్షించింది.
 
 12 శాసనసభ స్థానాలు కైవసం
 టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983, 1985లో ఎన్‌టీ రామారావు నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ జిల్లాలో 13 శాసనసభ స్థానాలను చేజిక్కించుకుంది. 1989 ఎన్నికల్లో రెండు స్థానాలకే
 
 పరిమితమైంది. మళ్లీ 1994 ఎన్నికల్లో 13 స్థానాల్లో గెలిచింది. కానీ.. 1999, 2004, 2009 ఎన్నికల్లో చతికిలపడింది. ఇప్పుడు నరేంద్రమోడీ చరిష్మాతో 12 శాసనసభ స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుతం టీడీపీ తరఫున తాడిపత్రి స్థానం నుంచి జేసీ ప్రభాకర్‌రెడ్డి(21,772 ఓట్ల మెజార్టీ), అనంతపురం నుంచి వి.ప్రభాకర్‌చౌదరి(9,334), శింగనమల నుంచి యామినీబాల(4,584), కళ్యాణదుర్గం నుంచి ఉన్నం హనుమంతరాయ చౌదరి(22,319), రాయదుర్గం నుంచి కాలవ శ్రీనివాసులు(1,758), గుంతకల్లు నుంచి జితేంద్రగౌడ్ (5,094), హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ(16,192), పెనుకొండ నుంచి బీకే పార్థసారథి(17,407), పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి(6,964), మడకశిర నుంచి ఈరన్న(14,636), ధర్మవరం నుంచి వరదాపురం సూరి(14,094), రాప్తాడు నుంచి పరిటాల సునీత(8,013) గెలుపొందారు. వైఎస్సార్‌సీపీ తరఫున కదిరి నుంచి అత్తార్ చాంద్‌బాష(967), ఉరవకొండ నుంచి వై.విశ్వేశ్వరరెడ్డి (2,225) విజయకేతనం ఎగురవేశారు.
 
 ఇదిలావుండగా... గుంతకల్లు శాసనసభ స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీకి కేటాయించారు. అయితే.. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా జితేంద్రగౌడ్‌ను బరిలోకి దింపారు. దీనిపై బీజేపీ ఆగ్రహించడంతో జితేంద్రగౌడ్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా ఆయన విజయం సాధించడం గమనార్హం.
 
 రెండు లోక్‌సభ స్థానాలూ టీడీపీ పరం
 జిల్లాలోని అనంతపురం, హిందూపురం లోక్‌సభ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అనంతపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి 61,991 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డిపై విజయం సాధించారు. హిందూపురం నుంచి సిటింగ్ ఎంపీ, టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దుద్దేకుంట శ్రీధర్‌రెడ్డిపై 97,854 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ రెండు స్థానాలను 1985, 1999 ఎన్నికల్లోనూ టీడీపీ కైవసం చేసుకుంది. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు రెండింటిలోనూ గెలుపొందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement