వైభవ్ లాడ్జిలో సర్వేబృందంలోని విజయవాడ యువకులు
రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న వైఎస్సార్‌సీపీ ఓట్ల తొలగింపు వ్యవహారం జిల్లాలోనూ బట్టబయలైంది. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కనుసన్నల్లో సర్వే బృందం పనిచేసినట్లు తెలుస్తోంది. చౌదరికి అత్యంత సన్నిహితుడైన టీడీపీ నేత ఎస్‌ఆర్ నాగభూషణానికి చెందిన ‘వైభవ్’ లాడ్జి కేంద్రంగా ఈ వ్యవహారం సాగింది. ‘సాక్షి’ వరుస కథనాల నేపథ్యంలో సర్వే బృందాన్ని లాడ్జీ ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తుండగా.. ‘సాక్షి’ ప్రతినిధులు అక్కడికి చేరుకోవడంతో గుట్టు రట్టయింది. టీడీపీ ఎంపీ మురళీమోహన్‌కు చెందిన జయభేరి సంస్థలో పనిచేస్తున్న విజయవాడ యువకులు సర్వే కోసం అనంతపురంలో తిష్టవేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ అడ్డడారులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: గత ఎన్నికలతో పోలిస్తే టీడీపీ బలహీనపడిన నియోజకవర్గాల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ నేతలు వక్ర మార్గాలను ఎంచుకున్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, తద్వారా వీలైనన్ని ఓట్లు తొలగిస్తే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందచ్చనే కుటిల ఆలోచనకు తెర తీశారు. ఇందుకోసం పక్కా ప్రణాళిక రచించారు. మొదట సర్వే పేరుతో ఇంటింటికీ వెళ్లి ఓటరు కార్డులను సేకరించారు. వీటి ఫొటోలను ట్యాబ్‌లు, సెల్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసుకున్నారు. ఓటరు కార్డు అనేది ఎన్నికల కమిషన్ జారీ చేసిన గుర్తింపుకార్డు. ఈ సమాచారాన్ని వ్యక్తి అనుమతి లేకుండా రాజకీయ అవసరాలకు వాడుకోకూడదు. అయితే ఓటరు కార్డు ఫొటోలు సేకరించిన సర్వే బృందం ఈ వివరాలన్నీ టీడీపీకి చెందిన వెబ్‌సైట్‌లోకి చేరవేశారు. ఓటర్ ఐడీ కార్డులో ఏ ఫొటో ఉందో, అదే ఫొటోను కాపీ చేసి టీడీపీ సభ్యత్వ నమోదు కార్డులో ముద్రించారు. అంటే ఓటర్ ఐడీలోని సమాచారం టీడీపీ నేతలు పూర్తిగా సేకరించారనేందుకు ఇంతకంటే సాక్ష్యాం మరొకటి ఉండదు. దీన్నిబట్టి ఓటరు కార్డుదారుల ప్రమేయం లేకుండానే వారి పేరుతో టీడీపీ గుర్తింపు కార్డులు జారీ అయ్యాయనేది స్పష్టమవుతోంది. ఇది టీడీపీ చేసిన మొదటి తప్పు.
టీడీపీ సభ్యత్వ నమోదు కార్డు, ఓటరు ఐడీ కార్డులో ఒకే ఫొటో ఉన్న దృశ్యం
ఓటర్ ఐడీ సమాచారంతోనే ఫారం–7 దరఖాస్తుల అప్‌లోడ్
టీడీపీ గుర్తింపుకార్డులోని ఫొటో, ఓటర్ ఐడీ ఫొటో చూస్తే టీడీపీ సభ్యత్వకార్డులు ఉన్న వారి సమాచారంతో పాటు, సభ్యత్వ కార్డులు లేని ఓటర్ల సమాచారం కూడా సేకరించారని అర్థమవుతోంది. ఈ సమాచారం ఆధారంగా వైఎస్సార్‌సీపీ నేతల ఓట్లు తొలగింపునకు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. ఎవరి ఓటు వారే తొలగించుకునేలా, భార్య ఓటు భర్త, వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఓటు ఆ పార్టీ నాయకుడు తొలగింపునకు దరఖాస్తు చేసినట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. చివరకు అనంతపురంలోని 84వ పోలింగ్ బూత్ పరిధిలోని బీఎల్‌ఓ లక్ష్మి ఓటును కూడా తొలగించాలని దరఖాస్తు చేశారంటే ఈ దరఖాస్తుల్లోని డొల్లతనం తేటతెల్లమవుతోంది. అనంతపురంతో పాటు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఇదే తరహాలో తప్పుడు సమాచారంతో వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగించడమే లక్ష్యంగా దరఖాస్తులు అప్‌లోడ్ చేశారు. ఇందుకు సంబంధించిన సర్వే బృందాలను వైఎస్సార్‌సీపీ నేతలు ఎక్కడికక్కడ అడ్డుకుని పోలీసుల దృష్టికి తీసుకెళ్తే పోలీసులు తిరిగి వైఎస్సార్‌సీపీ నేతలపైనే కేసులు నమోదు చేశారు. అయితే సర్వే బృందాలతో తమకేమీ సంబంధం లేదని ఇన్నాళ్లూ టీడీపీ నేతలు బుకాయించారు. తాజా ఉదంతంతో ‘సర్వే బృందాలు’ టీడీపీ కనుసన్నల్లో పనిచేశాయనే విషయం స్పష్టమైంది.
‘వైభవ్’ లాడ్జీలో 20 రోజులుగా తిష్ట
అనంతపురంలో సర్వే చేసేందుకు విజయవాడ నుంచి 15 మంది యువకులను ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి రప్పించినట్లు తెలుస్తోంది. వీరిని తనకు సన్నిహితుడైన ఎస్‌ఆర్ నాగభూషణానికి చెందిన బళ్లారిరోడ్‌లోని ‘వైభవ్’ లాడ్జీలో ఉంచారు. 206, 208తో పాటు మరో నాలుగు గదుల్లో వీరు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా నగరంలో సర్వే చేసి వ్యక్తిగత సమాచారం సేకరించడంతో పాటు ఇదివరకే ఉన్న ఓటర్ ఐడీ కార్డు సమాచారం ద్వారా ‘ఫారం–7’ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సర్వే బృందానికి చంద్రబాబు నాయుడు(సీఎం కాదు) అనే వ్యక్తి నాయకత్వం వహించినట్లు తెలుస్తోంది.
‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడం, రాష్ట్రవ్యాప్తంగా సర్వేకు సంబంధించి దుమారం రేగడం, తెలంగాణలో పోలీసులు కేసు నమోదు చేయడంతో సర్వే బృందాలను విజయవాడకు వెళ్లిపోవాలని ఎమ్మెల్యే సూచించినట్లు తెలిసింది. ఈ సమాచారం తెలిసి ‘సాక్షి’ బృందం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు లాడ్జీకి వెళ్లింది. 206 గదిలోకి వెళితే ఇద్దరు యువకులు ఉన్నారు. వీరి పేర్లను ఆరా తీస్తే చెప్పలేదు. అయితే తమది విజయవాడ అని, జయభేరి కంపెనీలో పనిచేస్తున్నామని చెప్పారు. 10 రోజులుగా ఇక్కడే ఉంటున్నామన్నారు. ‘జయభేరి’ అనేది ఎంపీ మురళీ మోహన్‌కు సంబంధించిన కంపెనీ. లగేజీ సర్దుకుని తిరుగు ప్రయాణం అవడానికి సిద్ధంగా ఉన్నారు. 208 గది వద్దకు వెళితే లాక్ చేశారు. వీరు ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment