
బాధిత భార్యాభర్తలు నాగమణి, చక్రవర్తి
యడ్లపాడు(చిలకలూరిపేట): అధికారం కోల్పోయినా టీడీపీ వర్గీయుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఒక రైతుకు చెందిన మిరప తోటలో గడ్డి మందు చల్లిన ఘటన గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం ఉప్పరపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు వల్లెపు చక్రవర్తి గ్రామంలో మూడు ఎకరాల కౌలు భూమిలో పత్తి, మిరప సాగు చేస్తున్నాడు.ఈ క్రమంలో టీడీపీకి చెందిన వల్లెపు చిన వెంకటేశ్వర్లు వర్గీయులు తమ పొలాల మధ్య ఉన్న భూమిని చక్రవర్తికి కౌలుకు ఇవ్వవద్దని భూ యజమాని కృష్ణారావుపై ఒత్తిడి తెస్తూ వచ్చారు.
అయితే చక్రవర్తి సకాలంలో కౌలు చెల్లిస్తుండటంతో ఆయనకే కృష్ణారావు తన భూమిని కౌలుకిచ్చాడు. దీంతో కక్ష పెంచుకున్న టీడీపీ వర్గీయులు చక్రవర్తికి చెందిన ఎకరంన్నర మిరప తోటలో గడ్డి మందు చల్లడంతో కాపునకు వస్తున్న మొక్కలు మాడిపోయాయి. ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్నట్లు చక్రవర్తి, ఆయన భార్య నాగమణి కన్నీటిపర్యంతమయ్యారు. తన పంటను నాశనం చేసిన వల్లెపు చిన వెంకటేశ్వర్లు, వల్లెపు పోల్‌రాజుయణ, మల్లెల గోపీ తదితరులపై చక్రవర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.