
పట్నంబజారు(గుంటూరు): రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా ధ్వజమెత్తారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అ«ధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డితో పాటు పార్టీ నేతలతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేవలం రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజా సంకల్పయాత్రలో వస్తున్న ప్రజాదరణ చూసి భయం పుట్టి, ఎన్నికల్లో గెలవలేమోనన్న భయంతో ఓట్లు తొలగించే ప్రక్రియను చేపట్టారని మండిపడ్డారు.
ప్రతి నియోజకవర్గంలో 20వేలకు పైగానే ఓట్లును తొలగిస్తున్నారని చెప్పారు. మైనారిటీల అభివృద్ధి ఏ మాత్రం పట్టని చంద్రబాబు ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కనీసం ఒక్క మైనారిటీకైనా మంత్రి పదవి ఇచ్చారా..బడ్జెట్‌లో రూ 400 కోట్లు చూపించి ఖర్చు చేసింది ఏముందని మండిపడ్డారు. చంద్రబాబులాగా నాటకాలు ఆడే వ్యక్తులు ప్రపంచలోనే ఎవ్వరూ ఉండరన్నారు. ఎవరెన్ని అవంతరాలు, అవరోధాలు చేసిన 2019లో వైఎస్ జగన్‌ను రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని చేయనున్నారని స్పష్టం చేశారు.
బంధాలను విడగొడతారా ?
కలిసి ఉన్న కుటుంబాలను చీలుస్తారు.. భార్యభర్తలను విడగొడతారు.. అన్నదమ్ములను వేరు చేసేలా కార్పొరేషన్ అధికారులు దౌర్భగ్యంగా వ్యవహరిస్తున్నారని పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపత్‌నగర్‌లో పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వకర్త కావటి మనోహర్‌నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు ఉంటుంటే.. మూడు ఓట్లు అక్కడ, మరికొన్ని విద్యానగర్‌లో, మరో మూడు ఓట్లు వేరే ప్రాంతంలో వచ్చాయంటే.. అధికారుల పనితీరుకు అద్దం పడుతోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసిన చంద్రబాబు, స్వప్రయోజనాల కోసం ఎంతటి దుశ్శాసానికి వెనుకాడటంలేదన్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కులమతాలకు అతీతంగా గుంపగుత్తగా ఓట్లు తొలగించే ప్రక్రియలు చేస్తున్నారని మండిపడ్డారు.
గుంటూరునగరం, రూరల్ పరిధిలో లక్షా యాభై వేలకు పైగా ఓట్లును తొలగించారన్నారు. ఓట్లు తొలగింపు అంశానికి సంబంధించి సాక్ష్యాధారాలతో సహా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ప్రజలు వారి ఓట్లును సరిచూసుకోవటంతో పాటు, అభిప్రాయాలను ఏ మాత్రం చెప్పవద్దని సూచించారు. అధికార పార్టీ దురాగతాలకు అధికారులు బలికావద్దని, ఓట్లు తొలగింపుపై అవసమైతే న్యాయస్ధానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలపురం రాము), గుంటూరు రూరల్ జెడ్పీటీసీ కొలకలూరి కోటేశ్వరరావు, పార్టీ నేతలు పాదర్తి రమేష్ గాంధీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment