Mohammad Mustafa
-
జరగని విందుకు.. మేము ఎలా వెళ్తాం?
సాక్షి, గుంటూరు : కరోనా వైరస్‌ను రాజకీయాలకు వాడుకోవడం నీచమైన చర్య అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని సూచించారు. ఆదివారం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు ఎమ్మెల్యే ముస్తాఫా ఇచ్చిన విందుకు తాను హాజరు కాలేదని స్పష్టం చేశారు. అలాగే ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ముస్తాఫా విందుకు వెళ్లారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అసలు విందే జరగలేదని.. జరగని విందుకు తామేలా వెళ్తామని ప్రశ్నించారు. ఓ వైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంటే.. రాజకీయ ప్రత్యర్థులు తమపై ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా క్వారంటైన్‌కు వెళ్లాలని ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని హితవు పలికారు. నిజంగా క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తే.. సామాజిక బాధ్యతగా తాము వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
పట్నంబజారు(గుంటూరు): రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా ధ్వజమెత్తారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అ«ధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డితో పాటు పార్టీ నేతలతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేవలం రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజా సంకల్పయాత్రలో వస్తున్న ప్రజాదరణ చూసి భయం పుట్టి, ఎన్నికల్లో గెలవలేమోనన్న భయంతో ఓట్లు తొలగించే ప్రక్రియను చేపట్టారని మండిపడ్డారు. ప్రతి నియోజకవర్గంలో 20వేలకు పైగానే ఓట్లును తొలగిస్తున్నారని చెప్పారు. మైనారిటీల అభివృద్ధి ఏ మాత్రం పట్టని చంద్రబాబు ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కనీసం ఒక్క మైనారిటీకైనా మంత్రి పదవి ఇచ్చారా..బడ్జెట్లో రూ 400 కోట్లు చూపించి ఖర్చు చేసింది ఏముందని మండిపడ్డారు. చంద్రబాబులాగా నాటకాలు ఆడే వ్యక్తులు ప్రపంచలోనే ఎవ్వరూ ఉండరన్నారు. ఎవరెన్ని అవంతరాలు, అవరోధాలు చేసిన 2019లో వైఎస్ జగన్‌ను రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని చేయనున్నారని స్పష్టం చేశారు. బంధాలను విడగొడతారా ? కలిసి ఉన్న కుటుంబాలను చీలుస్తారు.. భార్యభర్తలను విడగొడతారు.. అన్నదమ్ములను వేరు చేసేలా కార్పొరేషన్ అధికారులు దౌర్భగ్యంగా వ్యవహరిస్తున్నారని పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపత్‌నగర్‌లో పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వకర్త కావటి మనోహర్‌నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు ఉంటుంటే.. మూడు ఓట్లు అక్కడ, మరికొన్ని విద్యానగర్‌లో, మరో మూడు ఓట్లు వేరే ప్రాంతంలో వచ్చాయంటే.. అధికారుల పనితీరుకు అద్దం పడుతోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసిన చంద్రబాబు, స్వప్రయోజనాల కోసం ఎంతటి దుశ్శాసానికి వెనుకాడటంలేదన్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కులమతాలకు అతీతంగా గుంపగుత్తగా ఓట్లు తొలగించే ప్రక్రియలు చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరునగరం, రూరల్ పరిధిలో లక్షా యాభై వేలకు పైగా ఓట్లును తొలగించారన్నారు. ఓట్లు తొలగింపు అంశానికి సంబంధించి సాక్ష్యాధారాలతో సహా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ప్రజలు వారి ఓట్లును సరిచూసుకోవటంతో పాటు, అభిప్రాయాలను ఏ మాత్రం చెప్పవద్దని సూచించారు. అధికార పార్టీ దురాగతాలకు అధికారులు బలికావద్దని, ఓట్లు తొలగింపుపై అవసమైతే న్యాయస్ధానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలపురం రాము), గుంటూరు రూరల్ జెడ్పీటీసీ కొలకలూరి కోటేశ్వరరావు, పార్టీ నేతలు పాదర్తి రమేష్ గాంధీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
మలేసియాకు దీటుగా ఏపీ
♦ రాజధాని నిర్మాణానికి మలేసియా సహకరించాలి: బాబు ♦ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు సదస్సులో పాల్గొన్న మలేసియా బృందం సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ను మలేసియాకు దీటుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మంగళవారం విజయవాడ గేట్‌వే హోటల్లో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో సీఎం పాల్గొన్నారు. మలేసియా అంతర్జాతీయ వాణిజ్య పరిశ్రమల మంత్రి ముస్తఫా మొహమ్మద్, ప్రతినిధుల బృందం కూడా ఈ సదస్సుకు హాజరైంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణానికి మలేసియా సహకారం అందించాలని కోరారు. ఇటీవల తాను దావోస్‌లో మలేసియా ప్రధానిని కలిసినప్పుడు ఏపీ అభివృద్ధిలో భాగస్వాములవడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు విశాలమైన తీర ప్రాంతముందని, ఇతర ప్రాం తాల కన్నా తీరప్రాంతాల అభివృద్ధి రేటు 5 రెట్లు అధికంగా ఉంటుందన్నారు. మలేసియా, సింగపూర్, జపాన్ వంటి దేశాలకు మన రాష్ట్ర తీరప్రాంతం దగ్గరగా ఉందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 26 దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు ముందు కొచ్చాయని, రాష్ట్రాన్ని తయారీరంగ కేంద్రంగా మారుస్తామని మలేసియా ప్రతినిధులకు వివరించారు. అతి త్వరలోనే విజయవాడ నుంచి కౌలాలంపూర్‌కు విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మలేసియా మంత్రి ముస్తఫా మొహహ్మద్ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములవుతామని వెల్లడించారు. మలేసియాకు టౌన్‌షిప్‌లు, నౌకాశ్రయాలు, రోడ్ల నిర్మాణం, పర్యాటక రంగ అభివృద్ధిలో అనుభవం ఉందని.. వాటిని రాష్ట్రానికి అందిస్తామని చెప్పారు. రాష్ర్టంలో పెట్టుబడుల ద్వారా భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని ఆశించారు. అంతకు ముందు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు ముఖ్య నిర్వహణాధికారి జె.కృష్ణకిశోర్ మౌలిక సదుపాయాలు, విద్యుత్ రంగం, అమరావతి రాజధాని నిర్మాణంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను మలేసియా బృందానికి వివరించారు.