
మలేసియాకు దీటుగా ఏపీ
♦ రాజధాని నిర్మాణానికి మలేసియా సహకరించాలి: బాబు
♦ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు సదస్సులో పాల్గొన్న మలేసియా బృందం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ను మలేసియాకు దీటుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మంగళవారం విజయవాడ గేట్‌వే హోటల్‌లో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో సీఎం పాల్గొన్నారు. మలేసియా అంతర్జాతీయ వాణిజ్య పరిశ్రమల మంత్రి ముస్తఫా మొహమ్మద్, ప్రతినిధుల బృందం కూడా ఈ సదస్సుకు హాజరైంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణానికి మలేసియా సహకారం అందించాలని కోరారు.
ఇటీవల తాను దావోస్‌లో మలేసియా ప్రధానిని కలిసినప్పుడు ఏపీ అభివృద్ధిలో భాగస్వాములవడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు విశాలమైన తీర ప్రాంతముందని, ఇతర ప్రాం తాల కన్నా తీరప్రాంతాల అభివృద్ధి రేటు 5 రెట్లు అధికంగా ఉంటుందన్నారు. మలేసియా, సింగపూర్, జపాన్ వంటి దేశాలకు మన రాష్ట్ర తీరప్రాంతం దగ్గరగా ఉందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 26 దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు ముందు కొచ్చాయని, రాష్ట్రాన్ని తయారీరంగ కేంద్రంగా మారుస్తామని మలేసియా ప్రతినిధులకు వివరించారు. అతి త్వరలోనే విజయవాడ నుంచి కౌలాలంపూర్‌కు విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
మలేసియా మంత్రి ముస్తఫా మొహహ్మద్ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములవుతామని వెల్లడించారు. మలేసియాకు టౌన్‌షిప్‌లు, నౌకాశ్రయాలు, రోడ్ల నిర్మాణం, పర్యాటక రంగ అభివృద్ధిలో అనుభవం ఉందని.. వాటిని రాష్ట్రానికి అందిస్తామని చెప్పారు. రాష్ర్టంలో పెట్టుబడుల ద్వారా భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని ఆశించారు. అంతకు ముందు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు ముఖ్య నిర్వహణాధికారి జె.కృష్ణకిశోర్ మౌలిక సదుపాయాలు, విద్యుత్ రంగం, అమరావతి రాజధాని నిర్మాణంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను మలేసియా బృందానికి వివరించారు.