అమలాపురం : అందివచ్చిన అవకాశం.. చేజారినట్టయింది. వ్యాయామోపాధ్యాయులు, భాషా పండితులను రెండేళ్లుగా ఊరిస్తున్న పదోన్నతులకు అంతరాయమేర్పడింది. రాష్ట్ర విభజనకు ముందు కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు పదోన్నతులకు ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్ర విభజన తరువాత పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఇప్పటి వరకు జీఓ జారీ చేయకపోవడంతో వారి ఆశలపై నీళ్లు జల్లినట్టయింది. జిల్లాలో సుమారు 125 మంది పీఈటీలు, 700 మంది భాషా పండితులు పదోన్నతులు పొందాల్సి ఉంది. ఉన్నత పాఠశాలల్లో పీఈటీలుగా పనిచేస్తున్న తమకు పీడీలుగా పదోన్నతులివ్వాలని రెండేళ్లుగా వారు కోరుతున్నారు. అలాగే జీఓ : 11, 12లలో సవరణలు చేసి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వాలని భాషా పండితులు కోరుతున్నారు.
పెరిగిన భారం
పీఈటీల విషయానికి వస్తే.. గతంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో ఒక పీడీ, ఒక పీఈటీ లేదా ఇద్దరు పీఈటీలు ఉండేవారు. రేషనలైజేషన్‌తో ప్రభుత్వం రెండేళ్ల క్రితం జీఓ: 55 జారీ చేసింది. ఈ జీఓ వల్ల 800 మంది దాటి ఉన్న జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో మాత్రమే ఫిజికల్ డెరైక్టర్ (పీడీ), ఒక పీఈటీ ఉండాలి. దీంతో చాలా తక్కువ పాఠశాలల్లో మాత్రమే పీడీ, పీఈటీలు పనిచేస్తున్నారు. 500 మంది విద్యార్థులున్న పాఠశాలలకు పీడీలు, అంతకన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలకు పీఈటీలు మాత్రమే ఉన్నారు.
500 మంది విద్యార్థులకు ఆటపాటలు నేర్పడం, విద్యార్థులను కట్టడి చేయడం తమకు తలకుమించిన భారంగా మారిందని పీఈటీలు గగ్గోలు పెట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇద్దరు, ముగ్గురు పీడీ, పీఈటీలు పనిచేస్తుంటే, అదే పని జెడ్పీ పాఠశాలల్లో ఒక్క పీడీయే చేయాల్సి వస్తోంది. సక్సెస్ స్కూళ్లలో కూడా ఇదే విధానం అమలు చేస్తున్నారు. ఉదాహరణకు కాకినాడ పీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీడీ, ఇద్దరు పీఈటీలు ఉండగా, ఇంచుమించు ఇదే స్థాయిలో విద్యార్థులున్న అమలాపురం బాలుర ఉన్నత పాఠశాలలో ఒక పీడీ మాత్రమే ఉన్నారు.
ఇక భాషా పండితులది మరో బాధ. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషా పండితులు సైతం పదోన్నతి కోసం పోరాటం చేస్తున్నారు. జీఓ: 11, 12ల వల్ల ఉద్యోగాల్లో చేరిన ఎస్‌జీటీలు ఎంఏ తెలుగు, ఇంగ్లీష్ పూర్తి చేసి భాషా పండితులుగా చేరి పదోన్నతులపై స్కూల్ అసిస్టెంట్లుగా జీతాలు పొందుతున్నారు. ఈ జీఓను సవరించి కేవలం భాషా పండితులకు మాత్రమే పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఊరించిన కిరణ్ జాగీరు.. ఉత్తర్వులివ్వని బాబు సర్కారు
Published Tue, Aug 26 2014 12:37 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement