బదిలీలు ఉన్నట్టా..లేనట్టా | Teachers Confused On Transfers | Sakshi
Sakshi News home page

బదిలీలు ఉన్నట్టా..లేనట్టా

Published Sat, Apr 28 2018 1:10 PM | Last Updated on Sat, Apr 28 2018 1:10 PM

Teachers Confused On Transfers - Sakshi

రాయవరం (మండపేట): ఈ ఏడాది బదిలీలు ఉంటాయా..ఉండవా అనే మీమాంసలో ఉపాధ్యాయ వర్గాలున్నాయి.  ఈ నెల 23తో ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసింది. సాధారణంగా బదిలీలు వేసవి సెలవుల్లో నిర్వహించాలని ఎప్పటి నుంచో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ వస్తున్నాయి. అయినా ప్రభుత్వం తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. గతేడాది నిర్వహించిన బదిలీలు వేసవి సెలవుల అనంతరం నిర్వహించారు. పాఠశాల పని దినాల్లో బదిలీలు నిర్వహించడంతో ఉపాధ్యాయులకే కాదు..విద్యార్థులూ నష్టపోతున్నారు.

జిల్లాలో 18వేల మంది ఉపాధ్యాయులు..
జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ యాజమాన్యాల పరిధిలో సుమారుగా 18 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. గతేడాది పాయింట్లు తక్కువై బదిలీలకు నోచుకోని వారు ఈ ఏడాదైనా బదిలీల్లో కోరుకున్న చోటుకు వెళ్దామన్న ఆశతో ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాయింట్ల విధానాన్ని తెరమీదకు తీసుకుని వచ్చింది. ఉపాధ్యాయుల పనితీరు ఆధారంగా పాయింట్లు కేటాయించడం, వెబ్‌ కౌన్సిలింగ్, బదిలీలకు సర్వీసు నిబంధనలను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ విధానాలపై ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

వచ్చే ఏడాది జరిగే అవకాశం లేదు
వచ్చే ఏడాది ఎన్నిక సంవత్సరం కావడంతో ఉపాధ్యాయ బదిలీలు జరిగే అవకాశం లేదు. దీంతో ఈ ఏడాది వేసవిలో తప్పనిసరిగా ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులను కలిసి బదిలీల షెడ్యూల్‌ విడుదల చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదిత్యనా«థ్‌ దాస్‌ను కూడా ఉపాధ్యాయ సంఘాలు కలిసి బదిలీలు చేపట్టాలని కోరగా, సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం.

డ్రాఫ్ట్‌ దశలోనే బదిలీల కోడ్‌
ఉపాధ్యాయ బదిలీలకు పర్మినెంట యాక్ట్‌ రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తూ వస్తున్నాయి. గత రెండేళ్లుగా చేస్తున్న డిమాండ్‌ నేపథ్యంలో గత నెలలో పర్మినెంట్‌ బదిలీల యాక్ట్‌పై డ్రాఫ్ట్‌ రూపొందించారు. కర్ణాటక ప్రభుత్వం ఉపాధ్యాయులకు బదిలీల యాక్ట్‌ను రూపొందించారు. అదే తరహాలో ఇక్కడ కూడా బదిలీల యాక్ట్‌ను రూపొందిస్తే, చట్ట ప్రకారం నిర్ణీత వ్యవధిలో బదిలీలు ఏటా జరిగే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు సూచిస్తున్నాయి. చట్టం చేయాలంటే శాసనసభలో అనుమతి పొందాల్సి ఉంది. అయితే ఇప్పట్లో శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తాత్కాలికంగా ఆర్డినెన్స్‌ తీసుకుని రావాలని డిమాండ్‌ చేస్తున్నాయి. డ్రాఫ్ట్‌ దశలో ఉన్న బదిలీల కోడ్‌పై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సంఘాలతో చర్చించి తుది దశకు తీసుకుని రావాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

వేసవి సెలవుల్లోనే చేపట్టాలి..
పాఠశాలలు ప్రారంభించే నాటికి బదిలీలు, టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ పూర్తి కావాలి. దీనిపై ఎప్పటి నుంచో పోరాడుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.– టి.కామేశ్వరం,యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

ఎన్నికల హామీ ఏమైంది..
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసవి సెలవుల్లోనే డీఎస్సీ నియామకాలు, బదిలీలు చేపడతామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలుపుకోకుండా వేసవి సెలవుల అనంతరం బదిలీలు, నియామకాలు చేపట్టడం విద్యా వ్యవస్థకు తూట్లు పొడవడమే.                   – కవి శేఖర్,
ఎస్‌టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement