‘‘పాఠశాల సమయంలో టీచర్లు సెల్‌ఫోన్ వినియోగించడం వల్ల ఆ ప్రభావం పిల్లల చదువుపై పడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో తరగతి గదిలో టీచరు చేతిలో సెల్‌ఫోన్ కనిపించకూడదు. ఇందుకు ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి. తరగతి గదిలో టీచరు సెల్‌ఫోన్‌తో కనిపిస్తే ఆయనతో పాటు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయున్ని కూడా బాధ్యుడిని చేస్తా. ఇద్దరిపైనా చర్యలుంటాయి. ఎవరైనా టీచరు తరగతి గదిలో సెల్‌ఫోన్ పట్టుకున్నట్లు కనిపిస్తే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నేరుగా నాకు ఫిర్యాదు చేయవచ్చు.’’
– శామ్యూల్, జిల్లా విద్యా శాఖ అధికారి
నాణ్యమైన విద్యకు అత్యంత ప్రాధాన్యత
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. ఈ విషయంలో కలెక్టర్ సత్యనారాయణ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చాలా స్కూళ్లలో ఐదో తరగతి పిల్లలకు కూడా రాయడం, చదవడం రాకపోవడం బాధాకరం. ప్రైమరీ విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంపొందించేలా చర్యలు తీసుకుంటా. ఇక ఉన్నత పాఠశాలల్లో ఆయా తరగతులకు సంబంధించిన పాఠ్యాంశాల్లో పిల్లలకు కనీస పరిజ్ఞానం ఉండేలా చూడాల్సిన బాధ్యత టీచర్లపై ఉంది.
సాక్షి, అనంతపురం ఎడ్యుకేషన్ : ‘అనంత’ కరువుకు చిరునామా.. వ్యవసాయమే జీవనాధారం. పంటలు సరిగా పండవు. ఆర్థిక ఇబ్బందులున్న కుటుంబాలే అధికం. అందుకే అందరూ తమ పిల్లలను ప్రభుత్వ బడులకే పంపుతారు. నూతన సర్కార్ కూడా విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సిద్ధమైంది. పాఠశాలల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 5.50 లక్షల మంది విద్యార్థుల భవిత, ఉపాధ్యాయుల పనితీరు, ఉపాధ్యాయ సంఘాల నేతల వ్యవహారం, డీఈఓ కార్యాలయ సిబ్బందిపై వస్తున్న ఆరోపణలు తదితరాలపై ఇటీవలే జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన కాగిత శామ్యూల్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. విద్యార్థుల సంక్షేమానికి, ప్రభుత్వ విద్య బలోపేతానికి తీసుకోనున్న చర్యలు ఆయన మాటల్లోనే..
విద్యార్థుల సంఖ్యను పెంచుతాం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం కూడా ప్రాధాన్యతగా తీసు కుంటా. ఈ విద్యా సంవత్సరం ఇప్పటిదాకా అందిన సమాచారం మేరకు 13 వేల మందికిపైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. మరింతమంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్ల బాట పట్టేలా చర్యలు తీసుకుంటాం.
షెడ్యూలు ప్రకారం ఫార్మేటివ్ పరీక్షలు
ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ప్రతి స్కూల్‌లోనూ ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలి. టీచర్లు రిజిష్టర్లు పక్కాగా నిర్వహించాలి. టీచర్లు డైరీలు రాయాలి. లెసన్ ప్లాన్ తప్పకుండా రావాలి. ఎంఈఓలు, డిప్యుటీ డీఈఓలు తరచూ తనిఖీలు నిర్వహించి ఈ అంశాలన్నీ పరిశీలించాలి.
అవినీతి రహిత పాలన
డీఈఓ కార్యాలయంలో అవినీతికి తావులేకుండా పాలన సాగిస్తా. ప్రతి ఫైలుకూ ఒక రేటు ఫిక్స్ చేశారనే వార్తలు రావడం దారుణం. ఇప్పటిదాకా ఎలా జరిగిందో నాకు తెలీదు. ఇకపై ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉంటా. పెండింగ్ ఫైళ్ల విషయమై బాధితులెవరైనా నన్ను కలిసి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.
బయోమెట్రిక్ పక్కాగా అమలు
పది రోజులు గడువు పెట్టుకున్నా. జిల్లాలో అన్ని కేడర్ల టీచర్లు 18 వేలమంది దాకా ఉన్నారు. వారంతా వందశాతం బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సిందే. కుంటిసాకులు చెబితే ఒప్పుకోను. ఏవైనా సాంకేతికపరమైన ఇబ్బందులుంటే ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. 1,700 డివైజ్‌లు కొత్తగా వచ్చాయి. అవసరమైన స్కూళ్లకు వాటిని అందజేస్తాం. అప్పటికీ అటెండెన్స్ శాతం పెరగకపోతే మాత్రం కఠినంగా వ్యవహరిస్తా.
‘నవ ప్రయాస్’కు నోటీసులు
పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి మండలాల్లోని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్న ‘నవ ప్రయాస్’ ఏజెన్సీపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. భోజనం సరిగా లేకపోవడంతో మూడు మండలాల్లోని స్కూళ్లలో 50 శాతం మంది విద్యార్థులు కూడా భోజనం తినడం లేదు. దీనిపై ఏజెన్సీకి నోటీసులిచ్చాం. నవ ప్రయాస్ సంస్థ సరఫరా చేస్తున్న భోజనం నాణ్యతపై ఆహారభద్రత అధికారులతో విచారణ చేయిస్తున్నాం. వారి నివేదిక రాగానే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం.
అందరూ సమానమే
స్కూల్ పనివేళల్లో ప్రతి టీచరూ బడిలోనే ఉండాలి. ఈ విషయంలో సామాన్య టీచర్లయినా, ఉపాధ్యాయ సంఘాల నాయకులైనా ఒకటే. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాత్రం... ఎవరినీ ఉపేక్షించను. పనివేళల్లో టీచర్లు ఎవరూ కూడా నన్ను కలిసేందుకు కార్యాలయానికి రావొద్దు. వారంలో మూడు రోజులు సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉంటా. ఏదైనా సమస్య ఉంటే ఆ సమయంలో నన్ను కలవవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కొందరు టీచర్లపై పక్కా ఆధారాలతో ఫిర్యాదులు అందాయి. అలాంటి వారి భరతం పడతా.
Comments
Please login to add a commentAdd a comment