సాక్షి, విశాఖపట్నం : భీమిలి, అనకాపల్లి విలీనం జీవీఎంసీకి ఆర్థిక చిక్కుల్ని తెచ్చిపెడుతోంది. ఉపాధ్యాయులు, మెప్మా సిబ్బంది జీతాల చెల్లింపు సమస్యగా మారింది. ఇప్పటికే ఉన్న ఆర్థిక భారానికి అదనంగా ప్రతి నెలా రూ. 2.20 కోట్లు వరకు జీవీఎంసీపై భారం పడనున్నట్లు అధికారులు లెక్క తేల్చారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేలా కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ తాజాగా లేఖ రాయడం గమనార్హం. దీనిపై ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.
టీచర్ల జీతాలే రూ.2 కోట్లు
అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 450 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. పదవీ విరమణ చేసినవారు కూడా ఎక్కువమందే ఉన్నారు. వీరికి ప్రతి నెలా జీతాలు, పింఛన్ల రూపంలో దాదాపు రూ.2 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. ఇప్పటి వరకు ఈ మున్సిపాలిటీల్లోని ఉపాధ్యాయులు 010 పద్దు కింద జీతాలు అందుకునేవారు. జీవీఎంసీలో ఈ మున్సిపాలిటీలు విలీనం కావడంతో వీరి జీతాల చెల్లింపును 010 పద్దు రూపంలో ఇక చెల్లించేది లేదంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఇక్కడ పనిచేస్తోన్న మెప్మా ఉద్యోగులకు పురపాలక శాఖే జీతాలు చెల్లిస్తోంది. వీరి జీతాలు కూడా జీవీఎంసీ చెల్లించాలంటూ పేర్కొనడంతో జీవీఎంసీ ఎటూ పాలుపోని స్థితిలో సతమతమవుతోంది.
010 పద్దు వచ్చేనా!
జీవీఎంసీ, విజయవాడ కార్పొరేషన్లు మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలు/కార్పొరేషన్లలో ఉపాధ్యాయులు 010 పద్దు కింద ఠంచనుగా జీతాలందుకుంటున్నారు. జీవీఎంసీ, విజయవాడ కార్పొరేషన్లలో మాత్రం సాధారణ నిధుల నుంచే వీరికి జీతాలు చెల్లించుకోవాలి. తర్వాత ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో ఆ నిధులు ఈ కార్పొరేషన్లకు అందిస్తుంది. తమకు కూడా 010 పద్దు కింద జీతాలివ్వాలంటూ చాలా కాలం నుంచీ ఇక్కడి ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదనల ఫైల్ కూడా ఆగస్టు తొలి వారంలో విద్యాశాఖ ఆమోదం పొందింది. తర్వాత ఆర్థిక శాఖ నుంచి కూడా పచ్చజెండా లభించింది. తర్వాత ప్రభుత్వ ఉత్తర్వుల రూపంలో తెచ్చేందుకు పురపాలన, పట్టణాభివృద్ధి శాఖకు వెళ్లింది. ఇది జరిగి మూడు వారాలు గడుస్తున్నా.. ఇప్పటికీ దీనికి జీవో రాలేదు.
ప్రభుత్వానికి నివేదించాం
ఇప్పటికే జీవీఎంసీలో సిబ్బంది జీతాలకు రూ.175 కోట్లు, రుణాలపై వడ్డీకి రూ.60 కోట్లు ఏటా చెల్లించాల్సి వస్తోంది. ఇక్కడి టీచర్ల జీతాల్నే 010 పద్దు కింద ప్రభుత్వం భరించేలా ఎప్పటి నుంచే మొరపెట్టుకుంటున్నాం. ఇపుడు భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలకు చెందిన ఉపాధ్యాయులు, మెప్మా ఉద్యోగుల జీతాల్ని కూడా చెల్లించాలంటే మరింత భారమవుతుంది. అందుకే దీనిపై ప్రభుత్వానికి నివేదించాం. వారి వరకు ప్రస్తుత చెల్లింపు విధానమే కొనసాగించేలా ప్రయత్నిస్తున్నాం.
- ఎం.వి.సత్యనారాయణ, కమిషనర్
టీచర్లు, మెప్మా ఉద్యోగుల వేతనాలపై సందిగ్ధం
Published Sun, Sep 1 2013 1:14 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement