అధికారులకు పరీక్షే !
ఒకవైపు పరీక్షలు, మరోవైపు ఎన్నికలు
ఈ నెల 12 నుంచి ఇంటర్, 27 నుంచి టెన్త్ ఎగ్జామ్స్
30న మున్సిపోల్స్
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: తరుముకొస్తున్న పరీక్షా కాలం.. దూసుకొస్తున్న ఎన్నికల సీజన్‌తో అధికారులు హడలిపోతున్నారు. ఈ రెండింటి బాధ్యతలను నిర్వహించాల్సిన ఉపాధ్యాయులు, అధికారులు ఇప్పుడు విషమ పరీక్షనే ఎదుర్కొంటున్నారు. విద్యా సంవత్సరమంతా తరగతి గదులకే పరిమితమైన విద్యార్థులు విజయం సాధించాలనే తపనతో వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతుండ గా, రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రజలను మచ్చిక చేసుకొని ఓట్లు సంపాదించి ప్రజా ప్రతినిధులుగా గెలిపొందాలనే ఆశతో మున్సిపల్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఇంకోవైపు జిల్లా అధికారులు వీటి నిర్వహణలో ఇబ్బం దులు లేకుండా ఎలా గట్టెక్కగలమని ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరికొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే రైల్వే, అటవీ శాఖలతో పాటు వివిధ శాఖలు నిర్వహించే పోటీ పరీక్షల కోసంనిరుద్యోగులు కుస్తీ పడుతున్నారు. ఈ విధంగా అందరూ ఎప్పుడు లేనివిధంగా ఎవరికి వారు పరీక్షలకు సిద్ధమవుతుండగా..వీటిని సక్రమంగా నిర్వహించాల్సిన అధికారుల్లో మాత్రం రక్తం వేడివేడిగా ప్రవహిస్తోంది.
ఈ నెల 12 నుంచి ఇంటర్మీడియెట్, 27 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటిని సక్రమంగా నిర్వహించేం దుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో అనుకోకుండా మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. దీనికి కారణం ఇటు పరీక్షలు అటు ఎన్నికలు ఏక కాలంలో జరుగుతుండడమే. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాజకీయ నాయకుల హడావుడి మొదలవ్వగా.. పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యార్థుల్లో టెన్షన్ ఎక్కువైంది. ఈ క్రమంలో ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే ఆ రోజు ఆదివారం కావడంతో పరీక్షలు వాయిదా పడక పోయినా, ఏప్రిల్ ఒకటిన అవసరమైన చోట్ల రీ పోలింగ్, రెండో తేదీన కౌంటింగ్ జరిగే తేదీల్లో పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అలాగే పరీక్షల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎన్నికల నిర్వహణ విధులకు కూడా వెళ్లాల్సి ఉంటుంది.
పరీక్షల అనంతరం జవాబు పత్రాల మూల్యాం కన సైతం ఉపాధ్యాయులు, అధ్యాపకులే చేయాలి. దీంతో ఇటు పరీక్షలు, అటు ఎన్నికలు నిర్వహణ బాధ్యతలతో వీరు సతమతమయ్యే పరిస్థితి ఉంది. ఇదిలాఉంటే రాజకీయ నాయకులు కూడా ఎన్నికలనే పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో పాలకొండ, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలసల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. వీటికి తోడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా వస్తే ఇక తమపనిఅంతే అని అందరూ భయపడుతున్నారు. ఏదిఏమైనా మార్చి నెల అందరికీ పరీక్షా కాలమనే చెప్పాలి.