narasanna peta
-
దుష్ట చతుష్టయం.. రాక్షస మూక
రాజకీయం అంటే ఒక జవాబుదారీతనం. ప్రజలకు.. ఇంటింటికీ మనం మంచి చేస్తే, ఆ మంచిని చూసి వారు ఓటు వేస్తేనే పాలకులు అధికారంలో ఉంటారనే ఆలోచన కలగాలి. లేదంటే అధికారం నుంచి పోవాలనే మెసేజ్ వెళ్లాలి. అదీ రాజకీయం. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే.. వాళ్లను ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక జగన్ అని అంటారు. కానీ సొంత కూతురును ఇచ్చిన మామకు, మామ పెట్టిన పార్టీకి, మామ పెట్టిన ట్రస్టుకు, చివరకు మామకు ప్రజలు ఇచ్చిన సీఎం కుర్చీకి.. వెన్నుపోటు పొడిచి కబ్జా చేసే వాళ్లను చంద్రబాబు అంటారు. రావణుడిని సమర్థించిన వాళ్లను మనమంతా రాక్షసులంటాం. దుర్యోధనుడికి కొమ్ము కాసిన వాళ్లను దుష్ట చతుష్టయం అని అంటున్నాం. మరి మామ కుర్చీని కబ్జా చేసి, మామ పార్టీని దందా చేసి, ఎన్నికలప్పుడు ప్రజలకు మాయమాటలు చెప్పి, ఆ తర్వాత ప్రజలను గాలికొదిలేసి మోసం చేసే చంద్రబాబును సమర్థిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడిని ఏమనాలి? దుష్ట చతుష్టయమని అనాలా? వద్దా? రాక్షస మూకలనాలా? వద్దా?.. అనేది ప్రజలు ఆలోచించాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బుధవారం ఆయన జగనన్న శాశ్వత భూహక్కు – భూ రక్ష కార్యక్రమం తొలి విడత లబ్ధిదారులకు భూ హక్కుల పత్రాల పంపిణీ, రెండో విడత సర్వే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు అండ్ కోపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. లబ్ధిదారు వెలమల శ్రీదేవికి జగనన్న భూహక్కు పత్రాన్ని అందజేస్తున్న సీఎం జగన్ చంద్రబాబు రాముడా.. రావణుడా? ► తన ఆస్తిని తాను అనుభవించే వాళ్లను హక్కుదారుడు అంటారు. అదే పరాయి వాడి ఆస్తిని ఆక్రమించే వారిని కబ్జాదారుడు అంటారు. తన భార్యతో సంసారం చేస్తే, ఆమె కోసం యుద్ధం చేస్తే.. ఆ మనిషిని శ్రీరాముడు అంటారు. అదే పరాయి స్త్రీ మీద కన్ను వేసి ఎత్తుకుపోతే.. అలాంటి వాళ్లను రావణుడు అంటారు. చంద్రబాబు రాముడా.. రావణుడా? రావణుడికి, దుర్యోధనుడికి, మోసం చేసిన వారికి, వెన్నుపోటు పొడిచే వారికి మరో చాన్స్ ఎవరైనా ఇస్తారా? ► తమను గెలిపించిన ప్రజలకు ఇచ్చిన మాటను నాయకులు నిలబెట్టుకోవాలి. అప్పుడే దాన్ని నిజమైన ప్రజాస్వామ్యం అంటారు. కానీ గెలిపించిన ప్రజలను ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. అనేక సార్లు మోసం చేసి, మాట తప్పి, వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడిని మరోసారి అసెంబ్లీకి పంపాలా? మీ సేవలు మాకొద్దని బైబై చెప్పి ఇంటికి పంపాలా? అనేది ప్రజలు ఆలోచించాలి. ► ఇవాళ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే.. కేవలం నలుగురు తోడుగా ఉంటే చాలు ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనే దుస్థితికి వచ్చాయి. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు.. నాకు వీళ్లుంటే చాలు.. ఇక ప్రజలతో అవసరం లేదు, ప్రజలను మోసం చేసినా, వాళ్లకు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎవ్వరూ రాయరు. ఎవ్వరూ చూపరు. ఎవ్వరూ ప్రశ్నించరనుకునే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ► నేను నమ్ముకున్నది దేవుడి దయను, ప్రజలను మాత్రమే. చంద్రబాబులా దుష్ట చతుష్టయాన్ని నమ్ముకోలేదు. మీ అందరితో నేను ఇదే చెబుతున్నాను. వీళ్లు చెప్పే అబద్ధాలను నమ్మొద్దండి. టీవీల్లో వీళ్లు చూపించే అబద్ధాలను చూడొద్దండి. మీ ఇంటిలో మంచి జరిగిందా.. లేదా.. అన్నదే కొలమానంగా పెట్టుకోండి. మంచి జరిగి ఉంటే.. మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ జగన్‌కు తోడుగా నిలబడండి. -
కొత్తగా వచ్చినోళ్లూ నన్ను విమర్శించేవారే!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నలభయ్యేళ్ల రాజకీయ జీవితం ఉన్న తనపై కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినవారూ విమర్శలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలంలో బొంతు ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేసి రంగసాగరం చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. అనంతరం చెరువు వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తూ హోదాపై జగన్ ఒక్కరే పోరాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెబుతున్నారని, తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లానని పునరుద్ఘాటించారు. బీజేపీ, జగన్ కలిసిపోయారని ఆరోపించారు. 11 రాష్ట్రాలకు హోదా కల్పించిన కేంద్రం మన రాష్ట్రానికి ఇవ్వకపోవడంపై నిలదీస్తే జవాబు చెప్పలేదని, అందుకే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చేశామని చెప్పారు. ఇసుక ఉచితమని చెప్పినా దందా జరుగుతోందని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరు అడ్డుకున్నా ప్రజలు 1100 నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అధికారుల్లో సోమరిపోతులు, అవినీతిపరులు ఉన్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలిపించి ఇస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం రావాలో తానే నిర్ణయిస్తానని, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ రాబడతానని చంద్రబాబు పునరుద్ఘాటించారు. బస్సుల్లో జనాల తరలింపు... చంద్రబాబు ఉదయం రాజధాని నుంచి విమానంలో విశాఖకు వచ్చారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో రంగసాగరం చెరువు గర్భంలో హెలిప్యాడ్‌కు చేరుకుని బురుజువాడ గ్రామాన్ని సందర్శించారు. చిన్నకిట్టలపాడు గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. అక్కడ ప్రసంగిస్తూ గ్రామంలో అందరికీ పింఛన్లు సక్రమంగా వస్తున్నాయా? టీడీపీ తమ్ముళ్లు కమీషన్లు తీసుకోకుండా ఇస్తున్నారా? చేతులెత్తి అంగీకారం తెలపండని కోరారు. కేవలం పది మంది మాత్రమే చేతులెత్తడంతో చంద్రబాబు కంగుతిన్నారు. ఉదయం నుంచి సుమారు 200 బస్సుల్లో జిల్లాలోని పలు గ్రామాల నుంచి జనాన్ని తరలించినా మధ్యాహ్నం 3 గంటలకు సభ మొదలయ్యే సమయానికి పలుచగానే కనిపించారు. టీడీపీ నాయకులు హుటాహుటిన బస్సుల్లో జనాన్ని సభకు తీసుకొచ్చి ఊపిరిపీల్చుకున్నారు. -
యూరియా బాదుడు
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్ : ఇప్పటికే సవాలక్ష కష్టాలతో సతమతమవుతున్న అన్నదాతపై మరో పిడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం యూరియా ధరను టన్నుకు 350 రూపాయల మేర పెంచి నడ్డి విరిచింది. దీంతో జిల్లాలోని రైతులపై ఏటా 2.5 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడనుంది. జిల్లాలోని వరి సాగు చేస్తున్న రైతులు ఖరీఫ్, రబీ సీజన్లలో దాదాపు 70 వేల టన్నుల యూరియాను వినియోగిస్తున్నారు. ప్రస్తుత రబీ సీజన్లో వరి పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో యూరియాను విరివిగా వాడతారు. ఈ తరుణంలో ధర భారీగా పెరగటం రైతులను కుంగదీసింది. ధర పెంపును ప్రభుత్వం విరమించుకోవాలని వారు డిమాం డ్ చేస్తున్నారు. ప్రధానంగా భారమంతా సన్న, చిన్నకారు, కౌలు రైతులపైనే అధికంగా ఉంటుంది. వరుసగా దండెత్తిన తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా ఇప్పటికీ వీరంతా పూర్తిగా నష్టపోయారు. దీనినుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న తరుణంలో కేం ద్రం యూరియా ధరను పెంచటం వారికి తీవ్ర ఆందోళన కలిగి స్తోంది. జిల్లాలో 50 కిలోల యూరియా బస్తా ధర ఇప్పటివరకు 284 రూపాయలు ఉండగా ఇకపై 302 రూపాయలకు పెరగనుంది. పెంచిన ధర తగ్గించాలి పెంచిన యూరియా ధరను ప్రభుత్వం వెంటనే తగ్గించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క రూపాయి భారం పడ్డా రైతులు తట్టుకో లేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతకు న్యాయం చేయాలి. - పోలాకి నర్సింహమూర్తి, రైతు, బడ్డవానిపేట -
అధికారులకు పరీక్షే !
ఒకవైపు పరీక్షలు, మరోవైపు ఎన్నికలు ఈ నెల 12 నుంచి ఇంటర్, 27 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ 30న మున్సిపోల్స్ నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: తరుముకొస్తున్న పరీక్షా కాలం.. దూసుకొస్తున్న ఎన్నికల సీజన్‌తో అధికారులు హడలిపోతున్నారు. ఈ రెండింటి బాధ్యతలను నిర్వహించాల్సిన ఉపాధ్యాయులు, అధికారులు ఇప్పుడు విషమ పరీక్షనే ఎదుర్కొంటున్నారు. విద్యా సంవత్సరమంతా తరగతి గదులకే పరిమితమైన విద్యార్థులు విజయం సాధించాలనే తపనతో వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతుండ గా, రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రజలను మచ్చిక చేసుకొని ఓట్లు సంపాదించి ప్రజా ప్రతినిధులుగా గెలిపొందాలనే ఆశతో మున్సిపల్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు జిల్లా అధికారులు వీటి నిర్వహణలో ఇబ్బం దులు లేకుండా ఎలా గట్టెక్కగలమని ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరికొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే రైల్వే, అటవీ శాఖలతో పాటు వివిధ శాఖలు నిర్వహించే పోటీ పరీక్షల కోసంనిరుద్యోగులు కుస్తీ పడుతున్నారు. ఈ విధంగా అందరూ ఎప్పుడు లేనివిధంగా ఎవరికి వారు పరీక్షలకు సిద్ధమవుతుండగా..వీటిని సక్రమంగా నిర్వహించాల్సిన అధికారుల్లో మాత్రం రక్తం వేడివేడిగా ప్రవహిస్తోంది. ఈ నెల 12 నుంచి ఇంటర్మీడియెట్, 27 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటిని సక్రమంగా నిర్వహించేం దుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో అనుకోకుండా మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. దీనికి కారణం ఇటు పరీక్షలు అటు ఎన్నికలు ఏక కాలంలో జరుగుతుండడమే. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాజకీయ నాయకుల హడావుడి మొదలవ్వగా.. పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యార్థుల్లో టెన్షన్ ఎక్కువైంది. ఈ క్రమంలో ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే ఆ రోజు ఆదివారం కావడంతో పరీక్షలు వాయిదా పడక పోయినా, ఏప్రిల్ ఒకటిన అవసరమైన చోట్ల రీ పోలింగ్, రెండో తేదీన కౌంటింగ్ జరిగే తేదీల్లో పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అలాగే పరీక్షల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎన్నికల నిర్వహణ విధులకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. పరీక్షల అనంతరం జవాబు పత్రాల మూల్యాం కన సైతం ఉపాధ్యాయులు, అధ్యాపకులే చేయాలి. దీంతో ఇటు పరీక్షలు, అటు ఎన్నికలు నిర్వహణ బాధ్యతలతో వీరు సతమతమయ్యే పరిస్థితి ఉంది. ఇదిలాఉంటే రాజకీయ నాయకులు కూడా ఎన్నికలనే పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో పాలకొండ, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలసల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. వీటికి తోడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా వస్తే ఇక తమపనిఅంతే అని అందరూ భయపడుతున్నారు. ఏదిఏమైనా మార్చి నెల అందరికీ పరీక్షా కాలమనే చెప్పాలి. -
స్త్రీ నిధి బ్యాంకులో 9 శాతం వడ్డీ
నరసన్నపేట, న్యూస్‌లైన్: స్త్రీనిధి బ్యాంకులో పొదుపు చేస్తే..9 శాతం వడ్డీ లభిస్తుందని కలెక్టర్ సౌరభ్గౌర చెప్పారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆంధ్రాబ్యాంకు ఆధ్వర్యంలో బుధవారం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ బ్యాంకులు లేని ప్రాంతాల్లో ఐకేపీ ఏపీఎంల ద్వారా బ్యాంకులు ఉన్న చోట డిపాజిట్ చేసుకోవచ్చన్నారు. జిల్లాలోని 30 వేల స్వయం శక్తి సంఘాలకు సుమారు రూ 350 కోట్లు రుణాలు మంజూరు చేశామన్నారు. స్వయంశక్తి సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. మరో రూ 100 కోట్ల రుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నరసన్నపేట మండల మహిళా సమాఖ్యకు రూ 2 కోట్లు రుణాలు మంజూరు చేస్తూ..మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. ప్రతి స్వయం శక్తి సంఘ సభ్యురాలు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవడమే..కాకుండా..మిగతా వారి ఇళ్లల్లో సైతం నిర్మించేం దుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంకు డీజీఎం ఏవీ రామకృష్న, మేనేజర్ టి.కామేశ్వరరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ శాస్త్రి, ఏపీడీ ధర్మారావు, తహశీల్దార్ ఎంవీ రమణ, ఎంపీడీవో ఎం.పోలినాయుడు, ఐకేపీ ఏసీ రవికుమార్, ఏపీఎం గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.