ఇప్పటికే సవాలక్ష కష్టాలతో సతమతమవుతున్న అన్నదాతపై మరో పిడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం యూరియా ధరను టన్నుకు 350 రూపాయల మేర పెంచి నడ్డి విరిచింది.
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్ : ఇప్పటికే సవాలక్ష కష్టాలతో సతమతమవుతున్న అన్నదాతపై మరో పిడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం యూరియా ధరను టన్నుకు 350 రూపాయల మేర పెంచి నడ్డి విరిచింది. దీంతో జిల్లాలోని రైతులపై ఏటా 2.5 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడనుంది. జిల్లాలోని వరి సాగు చేస్తున్న రైతులు ఖరీఫ్, రబీ సీజన్లలో దాదాపు 70 వేల టన్నుల యూరియాను వినియోగిస్తున్నారు. ప్రస్తుత రబీ సీజన్‌లో వరి పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో యూరియాను విరివిగా వాడతారు. ఈ తరుణంలో ధర భారీగా పెరగటం రైతులను కుంగదీసింది. ధర పెంపును ప్రభుత్వం విరమించుకోవాలని వారు డిమాం డ్ చేస్తున్నారు. ప్రధానంగా భారమంతా సన్న, చిన్నకారు, కౌలు రైతులపైనే అధికంగా ఉంటుంది. వరుసగా దండెత్తిన తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా ఇప్పటికీ వీరంతా పూర్తిగా నష్టపోయారు. దీనినుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న తరుణంలో కేం ద్రం యూరియా ధరను పెంచటం వారికి తీవ్ర ఆందోళన కలిగి స్తోంది. జిల్లాలో 50 కిలోల యూరియా బస్తా ధర ఇప్పటివరకు 284 రూపాయలు ఉండగా ఇకపై 302 రూపాయలకు పెరగనుంది.
పెంచిన ధర తగ్గించాలి
పెంచిన యూరియా ధరను ప్రభుత్వం వెంటనే తగ్గించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క రూపాయి భారం పడ్డా రైతులు తట్టుకో లేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతకు న్యాయం చేయాలి.
- పోలాకి నర్సింహమూర్తి, రైతు, బడ్డవానిపేట