రంగసాగరం సభలో మాట్లాడుతున్న సీఎం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నలభయ్యేళ్ల రాజకీయ జీవితం ఉన్న తనపై కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినవారూ విమర్శలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలంలో బొంతు ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేసి రంగసాగరం చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. అనంతరం చెరువు వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తూ హోదాపై జగన్ ఒక్కరే పోరాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెబుతున్నారని, తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లానని పునరుద్ఘాటించారు. బీజేపీ, జగన్ కలిసిపోయారని ఆరోపించారు. 11 రాష్ట్రాలకు హోదా కల్పించిన కేంద్రం మన రాష్ట్రానికి ఇవ్వకపోవడంపై నిలదీస్తే జవాబు చెప్పలేదని, అందుకే ఎన్‌డీఏ నుంచి బయటికి వచ్చేశామని చెప్పారు.
ఇసుక ఉచితమని చెప్పినా దందా జరుగుతోందని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరు అడ్డుకున్నా ప్రజలు 1100 నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అధికారుల్లో సోమరిపోతులు, అవినీతిపరులు ఉన్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలిపించి ఇస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం రావాలో తానే నిర్ణయిస్తానని, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ రాబడతానని చంద్రబాబు పునరుద్ఘాటించారు.
బస్సుల్లో జనాల తరలింపు...
చంద్రబాబు ఉదయం రాజధాని నుంచి విమానంలో విశాఖకు వచ్చారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రంగసాగరం చెరువు గర్భంలో హెలిప్యాడ్‌కు చేరుకుని బురుజువాడ గ్రామాన్ని సందర్శించారు. చిన్నకిట్టలపాడు గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. అక్కడ ప్రసంగిస్తూ గ్రామంలో అందరికీ పింఛన్లు సక్రమంగా వస్తున్నాయా? టీడీపీ తమ్ముళ్లు కమీషన్లు తీసుకోకుండా ఇస్తున్నారా? చేతులెత్తి అంగీకారం తెలపండని కోరారు. కేవలం పది మంది మాత్రమే చేతులెత్తడంతో చంద్రబాబు కంగుతిన్నారు. ఉదయం నుంచి సుమారు 200 బస్సుల్లో జిల్లాలోని పలు గ్రామాల నుంచి జనాన్ని తరలించినా మధ్యాహ్నం 3 గంటలకు సభ మొదలయ్యే సమయానికి పలుచగానే కనిపించారు. టీడీపీ నాయకులు హుటాహుటిన బస్సుల్లో జనాన్ని సభకు తీసుకొచ్చి ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment