వీర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
Published Sat, Sep 28 2013 3:22 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
మెంటాడ,నూస్‌లైన్: అక్కడి గుండెలన్నీ బరువెక్కాయి.... ముష్కరుల దొంగదెబ్బకు బలైన తమ ఊరి బిడ్డను చూసి ఆ గ్రామం తల్లడిల్లిపోయింది. ఆ వీర జవాన్‌కు తుది వీడ్కోలు పలికేందుకు కదిలివచ్చింది... నీవే మాకు ఆదర్శమంటూ నివాళులు అర్పించింది. జమ్మూ-కాశ్మీర్‌లో సాంబా ప్రాంతం వద్ద గురువారం ఉదయం ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన జవాన్ మీసాల శ్రీనివాసరావు మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన స్వగ్రామం మెంటాడకు తీసుకువచ్చారు. దీంతో ఊరంతా ఒక్కసారిగా గొల్లుమంది. కుటుంబాన్ని పోషిస్తావనుకుంటే ఇంతలోనే వెళ్లిపోయావా నాయినా అంటూ.. శ్రీనివాసరావు తల్లిదండ్రులు అప్పలనాయుడు, అక్కమ్మలు రోదిస్తుంటే స్థానికులు కంటతడి పెట్టారు.
ఉద్యోగం వస్తే కష్టాలుండవని అనుకున్నాం.. కానీ మనిషే దక్కడని అనుకోలేదని వారు విలపిస్తుంటే అక్కడికి వచ్చిన అధికారులు, సైనిక సిబ్బంది, పోలీసుల గుండెలు బరువెక్కాయి. భర్త పోయిన దుఃఖంలో షాక్‌కు గురైన భార్య మాధవి .. శ్రీనివాసరావు మృతదేహంపై పడి రోదిస్తుంటే ఆమెను ఆపడం ఎవరి తరమూ కాలేదు. గ్రామస్తులు, బంధువులు, స్నేహితుల కన్నీటి వీడ్కోలు మధ్య శ్రీనివాసరావు మృత దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ వీడ్కోలు కార్యక్రమంలో ఆర్మీ, నేవీ, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ సూచికంగా శ్రీనివాసరావు మృతదేహంపై జాతీయపతాకాన్ని కప్పారు. సంతాప సూచికంగా ఏఆర్ సిబ్బంది మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు.
అనంతరం మీ సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకోవాలని తల్లిదండ్రులకు, బంధువులకు సూచించడంతో హిందూ సంప్రదాయం ప్రకారం దహనక్రియలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ పి.ఎ.శోభ, ఆర్డీఓ జి.రాజకుమారి, ఓఎస్‌డీ శ్రీనివాసురావు, విజయనగరం జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ వి.వి.రాజారావు, అదనపు డీఎస్పీ టి.మోహనరావు, మెంటాడ మండల ప్రత్యేకాధికారి మార్పు అమ్మాజీరావు, డిప్యూటీ తహశీల్దార్ పి.రామకృష్ణ, గంట్యాడ తహశీల్దార్ సిరిపురపు త్రినాథమ్మ, ఆండ్ర ఎస్‌ఐ బాబూరావు, మాజీ సైనికుడు దేవర ఈశ్వరరావు, గ్రామ సర్పంచ్ పాండ్రంకి కొండమ్మ, మాజీ సర్పంచ్‌లు రాయిపల్లి రవి, పాండ్రంకి సన్యాసిరావు తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
త్రివిధ దళాల నివాళులు
విశాఖపట్నం: అంతకు ముందు విశాఖ విమానాశ్రయంలో వీర జవాన్ మృతదేహానికి సైనిక సంప్రదాయాలతో నివాళులర్పించారు. త్రివిధ దళాధిపతులు పుష్పగుచ్ఛాలతో గౌరవ వందనం సమర్పించారు. ఆర్మీ, నేవీ, సీఐఎస్‌ఎఫ్, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. సైనికులు, నేవీ జవాన్లు గాడ్ ఆఫ్ ఆనర్ చేసి శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీనివాస్ తల్లిదండ్రులు అప్పలనాయుడు, అక్కమ్మ విమానాశ్రయానికిచేరుకున్నారు. విశాఖ సైనిక సంక్షేమాధికారి కెప్టెన్ సత్యప్రసాద్, విజయనగరం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దాండే, ఆర్డీవో రాజకుమారి, విశాఖ ఆర్డీవో వేణుగోపాల్, పోలీసు అధికారులు ఏడీసీపీ (క్రైమ్) వరదరాజు, ట్రాఫిక్ ఏసీపీ ఎల్.అర్జున్, నార్త్ ఏసీపీ పీ.ఎం.నాయుడు, ఎయిర్ పోర్టు సీఐ బాబ్జీ రావు, కంచరపాలెం ట్రాఫిక్ సీఐ శేషు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement