
ఆడపిల్ల అని...
‘పసివాడో ఏమిటో.. ఆపైవాడు. తను చేసిన బొమ్మలతో తలపడతాడు!’ అన్న సినీ రచయిత అక్షరాలు నిష్టుర సత్యమయ్యే ఘటన గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. ఓ పసికందు(ఆడ)ను ఇద్దరు తల్లులు మా బిడ్డ కాదంటే.. మా బిడ్డ కాదంటూ పంతానికి పోయారు. మగబిడ్డ కోసం పాకులాడుతూ.. మానవత్వం మరిచారు. తీవ్ర అస్వస్థత ఆ పాపాయి ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ స్పందించలేదు. ఆస్పత్రి సిబ్బంది సహా ఘటన గురించి తెలిసిన వారికి సైతం కన్నీరు పెట్టించింది ‘పాపం పసిపాప.’
సాక్షి, గుంటూరు: ప్రభుత్వ ఆసుపత్రి ప్రశూతి విభాగంలో గండి అనిత, కామినేని అనిత అనే ఇద్దరు గర్భిణులకు ఈ నెల 10న మధ్యాహ్నం 2 గంటలు, 2.10 నిమిషాలకు వరుసగా ప్రసవం చేశారు. వీరిలో ఒకరికి మగబిడ్డ, మరొకరికి ఆడబిడ్డ జన్మించారు. ప్రసవించిన వెంటనే తల్లులిద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఎవరికి ఏ బిడ్డ పుట్టారనేది వారికి తెలియలేదు. ఓ ఆయా గండి అనిత బంధువుల వద్దకు వచ్చి.. మీకు మగబిడ్డ పుట్టాడు, రూ.వెయ్యి ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో వారు ఆమెకు రూ.600 ఇచ్చారు. అనంతరం కొంతసేపటికి ఆమె మీకు ఆడబిడ్డ పుట్టిందని చెప్పడంతో, గండి అనిత బంధువులు ఆందోళనకు దిగారు. ఈ వివాదం ఈ నెల 12న సూపరింటెండెంట్ వద్దకు చేరింది. దీనిపై వైద్యుల బృందం రక్త పరీక్షలు నిర్వహించి బ్లడ్ గ్రూపుల ఆధారంగా మగబిడ్డ కామినేని అనితకు చెందిందని నిర్ధారించారు. తాము దీనికి అంగీకరించేది లేదని గండి అనిత బంధువులు భీష్మించినట్లు తెలిసింది. ఆడ శిశువుకు చిన్నపేగు ఏర్పడకపోవడంతో శుక్రవారం ఉదయం డాక్టర్ భాస్కరరావు ఆపరేషన్ నిర్వహించారు. అయితే, పరిస్థితి విషమించి బిడ్డ ప్రాణాలు కోల్పోయింది.
ఇంత జరిగినా: గండి అనిత బంధువులు మాత్రం ప్రజా సంఘాలతో కలసి మగబిడ్డ తమదేనంటూ కలెక్టర్, ఎస్పీలను కలసి ఫిర్యాదు చేశారు. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ క్రమంలో ఆడ శిశువు మృతదేహాన్ని ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో అధికారులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పాప మృతదేహాన్ని 2 రోజులు మార్చురీలో ఉంచి, అప్పటికీ తల్లిదండ్రులు స్పందించకపోతే మున్సిపాలిటీకి అప్పగించి అంత్యక్రియలు జరుపుతామని పోలీసులు చెప్పారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ వేణుగోపాలరావు మాట్లాడుతూ.. మృతి చెందిన ఆడ శిశువు.. గండి అనితకు చెందిందేనని తాము నియమించిన వైద్యుల బృందం తేల్చిందన్నారు. పాపకు ఆపరేషన్ నిర్వహించే సమయంలో తల్లి గండి అనిత, ఆమె తరఫు బంధువు సంతకం కూడా చేశారన్నారు.