నేడు తెలంగాణ బంద్ | Telangana bandh today | Sakshi
Sakshi News home page

నేడు తెలంగాణ బంద్

Published Sat, Sep 7 2013 2:59 AM | Last Updated on Wed, Oct 17 2018 3:43 PM

Telangana bandh today


 వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి వైఖరికి నిరసనగా, పార్లమెంట్‌లో వెంటనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు శనివారం చేపట్టనున్న బంద్‌కు పలు సంఘాలతోపాటు టీఆర్‌ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ తదితర రాజకీయ పక్షాలు సంపూర్ణ మదతు ప్రకటించాయి. ఈ మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ జేఏసీ, విద్యార్థి, న్యాయవాద, డాక్టర్ల సంఘాలు బంద్ విజయవంతానికి ప్రచారం నిర్వహించాయి. బంద్‌ను విజయవంతం చేయూలని శాంతి ర్యాలీలతో కదం తొక్కారుు. తెలంగాణ సభకు అనుమతినివ్వకుండా హైదరాబాద్‌లో సీమాంధ్ర సభలకు అనుమతినిస్తున్న సీఎం కిరణ్, డీజీపీ దినేష్‌రెడ్డి తీరును ఎండగట్టారుు. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థల యజమానులు, ఆటోయూనియన్లు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారుు. ఈ సందర్భంగా టీజేఏసీ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌లో భాగస్వాములు కావాలని కోరారు.
 
  టీఆర్‌ఎస్  జిల్లా ఇన్‌చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, మొలుగూరి బిక్షపతి బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, అర్బన్ అధ్యక్షుడు చింతాకుల సునీల్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చంద్రన్న, ఆర్టీసీ ఎన్‌ఎంయూ రిజినల్ కార్యదర్శి సీహెచ్.యాకస్వామి, టీఎంయూ రాష్ట్ర చైర్మన్ తిరుపతయ్య, టీపీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, నల్లెల రాజయ్య, జనగామ కుమారస్వామి బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
 బంద్‌కు ప్రైవేట్ పాఠశాలల యజమానులు మద్దతు ప్రకటించారు. బంద్‌లో పాల్గొనాలని నిర్ణయించినట్లు ఫర్టిలైజర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా, బంద్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా బస్‌స్టేషన్లు, రైల్లేస్టేషన్లు, ప్రధాన సెంటర్లలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. సెంట్రల్ జైలులో నక్సలైట్ ఖైదీలు కూడా తెలంగాణకు మద్దతుగా దీక్షలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement