పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలి
Published Fri, Sep 13 2013 4:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
నిర్మల్, న్యూస్‌లైన్ : పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి(ఐకే రెడ్డి) డిమాండ్ చేశారు. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద గురువారం ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు పలువురు ఒక రోజు శాంతి దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో అడ్డుకునేందుకు సీమాంధ్ర నాయకులు కుట్రలు పన్నడం అమానుషమని అన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలని అన్నారు.
ఉదయం ఐకే రెడ్డి నివాసం నుంచి మోటార్ సైకిళ్ల ర్యాలీతో శిబిరానికి చేరుకున్నారు. స్వాతంత్య్ర సమర యోధుడు ముడుసు ఎల్లయ్య సాయంత్రం ఐకే రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. జేఏసీ నాయకులు డాక్టర్ అప్పాల చక్రధారి, దామెర రాములు, కృష్ణంరాజు, నేరెళ్ల హన్మంతు, కోట్నాక రమేశ్, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ తుల శ్రీనివాస్, తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నిర్మల్ కన్వీనర్ తుకారాం, అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు గోపినాథ్ సంఘీభావం తెలిపారు. దీక్షలో నిర్మల్ ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, కోశాధికారి రమేశ్‌రెడ్డి, నాయకులు అప్పాల మహేశ్, ముడుసు సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ పద్మ, మాజీ సర్పంచ్ పద్మ, వాజీద్ అహ్మద్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement