సిద్దిపేట, న్యూస్‌లైన్:తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోమారు ప్లేటు ఫిరాయిస్తే ఊరుకునేది లేదని బీజేపీ జాతీయ కార్యవ ర్గ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ హెచ్చరించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరుతూ బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి సొప్పదండి విద్యాసాగర్ బుధవారం సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షకు బీజేపీ నేత లక్ష్మణ్‌తోపాటు బీజేపీ శాసనసభా పక్ష నేత, నిజామాబాద్ ఎమ్మెల్యే యండల లక్ష్మీనారాయణ తదితరులు సంఘీభావం ప్రకటించి విద్యాసాగర్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అంతకుముందు లక్ష్మణ్ ప్రసంగిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీలు రాష్ర్ట ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తిస్తున్నాయన్నారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్న సీమాంధ్ర నేతలను కట్టడి చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకోవడం ఎబ్బెట్టుగా ఉందన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ మాట తప్పితే తమ పార్టీ నేత నరేంద్రమోడీ నాయకత్వంలో ఏర్పడే కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.
వధేరా...ఆ రహస్యం వెల్లడిస్తవా..
‘కాంగ్రెస్ పాలన పుణ్యమాని తెలంగాణలో కుల వృత్తులు విధ్వంసమయ్యాయి. వాటినే నమ్ముకొన్న అనేకమంది ఉపాధి, ఉద్యోగాలు కరువై అలమటిస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు తారాజువ్వల్లా పైపైకి పోతున్నాయి. సాధారణ ప్రజలు భారంగా కాలం వెళ్లదీస్తున్నారు..పైసా పెట్టుబడి లేకుండా వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో...కాస్త ఆ రహస్యం మా తెలంగాణ ప్రజలకు వెల్లడించవా రాబర్ట్ వధేరా..!’ అంటూ సోనియాగాంధీ అల్లుడికి డాక్టర్ లక్ష్మణ్ చురకలంటించారు. బీజేపీ శాసనసభా పక్ష నేత, నిజామాబాద్ ఎమ్మెల్యే యండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల కారణంగా తెలంగాణలో 1100 మంది విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యాసాగర్ మాట్లాడుతూ తెలంగాణ బిల్లును లోక్‌సభలో ఆమోదించి విశ్వాసాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులు రామచందర్‌రావు, మోహన్‌రెడ్డి, ముదిగొండ శ్రీనివాస్, గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన దేవేందర్ కళాకారుల బృందం ఉద్యమ గేయాలతో అలరిచింది.
తెలంగాణపై మాట మారిస్తే ఖబడ్దార్
Published Thu, Sep 5 2013 5:52 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement