
సభను పొడిగించి టీ బిల్లుపై చర్చించాలి: జానారెడ్డి
సభను వాయిదా వేయకుండా, ప్రోరోగ్ చేయకుండా మరింత పొడిగించి ఈ అంశాన్ని చర్చించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి కోరారు. అందరి అభిప్రాయాలు సేకరించి, అన్ని ప్రాంతాల సభ్యుల అభిప్రాయాలు క్రోడీకరించి పార్లమెంటుకు పంపాలన్నారు. ఇంకా ఆయన ఇలా మాట్లాడారు... ''ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు అసెంబ్లీకి చేరింది. అందుకు సంతోషం వ్యక్తపరుస్తున్నా. సోనియాగాంధీకి, మన్మోహన్ సింగ్కు, కేంద్ర నాయకులందరికీ ధన్యవాదాలు. బిల్లు ఈరోజు అసెంబ్లీలో, మండలిలో ప్రవేశపెట్టినందుకు సభాధ్యక్షులకు ధన్యవాదాలు. ఇదే సందర్భంగా ఈ బిల్లును చర్చించడానికి ఫ్లోర్ లీడర్లు కూర్చుని చర్చించడం, బీఏసీ ఏర్పాటుచేయడం వెంటనే చేయాలి. అది ఈరోజే జరగాలని మా విజ్ఞప్తి. అయితే, ఈ సందర్భంలో సీమాంధ్ర శాసనసభ్యులు, ఇతర నాయకులు కొందరు బిల్లును కొంతసేపు ఆపుచేయడానికో, దాన్ని ఆలస్యం చేయించడానికో లేక ఇతరత్రా గందరగోళం సృష్టించడానికో ప్రయత్నం చేస్తున్నారు. కానీ అలాంటివి చేయకూడదు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో, రాజ్యాంగ చట్టబద్ధంగా, ఆర్టికల్ 3 ప్రకారం, ఇతర రాష్ట్రాల్లాగే తెలంగాణ ఏర్పడుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు'' అని జానారెడ్డి చెప్పారు.
''కానీ కేవలం ఆవేశం, ఆవేదన, అవగాహన లేని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైంది కాదని మా విజ్ఞప్తి. మీరంతా ఒక్కసారి ఆలోచించండి. మీ అందరి సమక్షంలోనే చరిత్రాత్మక బిల్లు వస్తోంది. టీడీపీ లేఖ ఇచ్చి ఆమోదించమంది. కానీ ప్రతులు చించడం, తగలబెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తా, అహంకారమా అని ఆలోచించాలి. మేధావులు వీటిపై వివరణ ఇవ్వాలి. ఎన్ని జరిగినా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో బిల్లు ముందుకు వెళ్తుంది'' అని జానారెడ్డి తెలిపారు.