రేణుకా చౌదరిని తొలగించాలని లేఖ
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి తెలంగాణ ప్రాంత ఎంపీలు లేఖ రాశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నుంచి రేణుకా చౌదరిని తొలగించాలని వారు తమ లేఖలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని కించపరిచేలా రేణుకా చౌదరి మాట్లాడారని టీ.ఎంపీలో పేర్కొన్నారు. మరోవైపు రేణుకా చౌదరిని ఎన్నికల కమిటీ సభ్యురాలిగా నియమించడం పట్ల ఎంపీలు మండిపడుతున్నారు. రేణుక తెలంగాణ ద్రోహి అంటూ ధ్వజమెత్తారు.
తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరుస్తూ మాట్లాడిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి ఆమెను ఎన్నికల కమిటీలో సభ్యురాలిగా ఎలా నియమిస్తారని కమిటీని ప్రశ్నించారు. గత కొంతకాలంగా రేణుకా చౌదరి వ్యవహార శైలిపై తెలంగాణ ప్రాంత ఎంపీలు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సమక్షంలో తెలంగాణ పీసీసీ ఎన్నికల సమావేశంలోనే ఈ విషయంపై తెలంగాణ ప్రాంత ఎంపీలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.