తాండూరు టౌన్, న్యూస్‌లైన్: అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ బిల్లుపై చర్చకు గడువు పొడిగిస్తే ఊరుకునేది లేదని.. మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతామని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టంచేశారు. గురువారం తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో తాండూరులో ఏర్పాటుచేసిన ‘సంపూర్ణ తెలంగాణ సాధన సదస్సు’లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
చర్చకు గడువు కోరి.. తెలంగాణ బిల్లును పార్లమెంటు సమావేశాల సమయానికి పంపించకూడదనే సీమాంధ్రులు కుట్ర పన్నుతున్నారన్నారు. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత దానిని ఆపాలనే కుట్రలు పన్నుతున్న సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు చర్చ జరగాలని పట్టుబడుతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ బిల్లు ప్రతులను భోగి మంటల్లో వేసి ఇక్కడి ప్రజల మనోభావాలను గాయపరిచారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ రెండేళ్లు సరిపోతుందని, పదేళ్లు అవసరం లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ సీమాంధ్రుల ఆస్తులను గానీ, వారిైపై గానీ ఉద్యమకారులు దాడులు చేయలేదని, అలాంటప్పుడు శాంతిభద్రతల విషయం గవర్నర్‌కు అప్పగించడం సమంజసమా అని ప్రశ్నించారు.
ఒకప్పుడు తెలంగాణ ఏర్పాటుకు తాము అడ్డంకి కాదని, ఇస్తే ఇవ్వండని చెప్పిన కొన్ని పార్టీలు ప్రస్తుతం తమ మనుగడ కోసమే కొత్త నాటకాలాడుతున్నాయన్నారు. ఎవరెన్ని చెప్పినా తెలంగాణ రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. సామాజిక విశ్లేషకులు గంటా చక్రపాణి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో నిరంతరం కృషిచేసిన వారే తెలంగాణ పునర్నిర్మాణంలో పాత్రులవుతారని అన్నారు. మరో నెల రోజుల్లో తెలంగాణ రావడం ఖాయమన్నారు. మంత్రి జైపాల్‌రెడ్డి ఇప్పటికైనా ధైర్యంగా ముందుకు వచ్చి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చే యాలని ఆయన కోరారు. అనంతరం ఆయన తెలంగాణ విద్యావంతుల వేదిక డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సాయిచంద్ ధూంధాం కార్యక్రమం తెలంగాణ వాదులను ఉర్రూతలూగించింది. కార్యక్రమంలో టీవీవీ , టీఆర్‌ఎస్, బీజేపీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, వైద్య జేఏసీల నాయకులు పాల్గొన్నారు.
మరో ఉద్యమానికి సిద్ధం
Published Fri, Jan 17 2014 12:39 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement