రఘు దీక్ష విరమణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ జేఏసీ కో ఆర్డినేటర్ రఘు తన 48 గంటల దీక్షను బుధవారం విరమించారు. ఆయనకు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. సీమాంధ్ర విద్యుత్ సమ్మెలో అరాచక శక్తుల జోక్యాన్ని అరికట్టాలని కోరుతూ రఘు 48 గంటల దీక్షను సోమవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. దీక్ష విరమణకు ముందు ఉస్మానియా ఆసుపత్రి నుండి ర్యాలీగా వచ్చిన రఘు విద్యుత్ సౌధలోని దీక్ష శిబిరం వద్ద బైఠాయించారు.
ఆయనను పరామర్శించేందుకు ఎంపీ పొన్నం ప్రభాకర్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎనుగుల రవీందర్, సోమారం సత్యనారాయణ, బిక్షపతి, టీజేఏసీ నేతలు కోదండరామ్, శ్రీనివాస్ గౌడ్, విఠల్, అద్దంకి దయాకర్‌లు వచ్చారు. అప్పటికే అక్కడ మోహరించి ఉన్న పోలీసులు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అదనపు డిసీపి నాగరాజు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ‘ఎత్తి వ్యాన్‌లో వేయండి’ అంటూ చేసిన వ్యాఖ్యలను విన్న జూపల్లి కృష్ణారావు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఆ తరువాత రఘు విద్యుత్‌సౌధ గేటు వద్దకు రావడంతో కోదండరామ్ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.