టీడీపీతో కుమ్మక్కై వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు
శాసనమండలిలో ప్రభుత్వ విప్ విక్రాంత్ ఫిర్యాదు
విచారణలో రుజువు కావడంతో ఆయన సభ్యత్వాన్ని రద్దుచేసిన మండలి చైర్మన్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు సాక్ష్యాలు బట్టబయలైన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు పడింది. ఆయన శాసనమండలి సభ్యత్వాన్ని రద్దుచేస్తూ, ఆ స్థానం ఖాళీ అయిందని పేర్కొంటూ సోమవారం మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాలను ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించారు. ప్రత్యర్థి పార్టీ టీడీపీతో కుమ్మక్కై వైఎస్సార్‌సీపీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపైన, పార్టీ నాయకులపైన అనుచిత వ్యాఖ్యలు చేశారని శాసనమండలిలో ప్రభుత్వ విప్ పాలవలస విక్రాంత్ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.
స్వయంగా హాజరై దీనిపై వివరణ ఇవ్వాలని నాలుగుసార్లు నోటీసులు పంపించినా రఘురాజు డుమ్మాకొట్టారు. మూడునెలల కిందటే రఘురాజు భార్య, ఎస్.కోట వైస్ ఎంపీపీ ఇందుకూరి సుబ్బలక్ష్మి అలియాస్ సుధారాజు టీడీపీ నేత లోకేశ్ సమక్షంలో ఆ పార్టీ కండువా వేయించుకున్నారు. టీడీపీ ఎస్.కోట అభ్యర్థి కోళ్ల లలితకుమారితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. రఘురాజు దంపతుల నివాసంలోనే టీడీపీ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు.
మరోవైపు కోళ్ల లలితకుమారికి, ఎస్.కోట టికెట్ కోసం విఫలయత్నం చేసిన గొంప కృష్ణకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు హైదరాబాద్‌లో లోకేశ్ సమక్షంలో జరిగిన పంచాయితీలో మండల టీడీపీ నాయకులతో కలిసి రఘురాజు పాల్గొన్నారు. ఇలా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆయన శాసనమండలి సభ్యత్వాన్ని రద్దుచేయాలని ప్రభుత్వ విప్ విక్రాంత్ ఫిర్యాదు చేశారు. రఘురాజు 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027 వరకు పదవీకాలం ఉన్నా పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడటంతో ఆయన సభ్యత్వం రద్దయింది.
Comments
Please login to add a commentAdd a comment