విభజన ప్రక్రియ ఆగదు: జానారెడ్డి
తెలంగాణ రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగనే ఆగదని రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి కే.జానారెడ్డి స్పష్టం చేశారు. శనివారం మినిస్టర్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన టి.మంత్రులతో టి.జేఏసీ నేతల భేటీ ముగిసింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జానారెడ్డి ప్రసంగించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తు సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న సమ్మెను విరమింప చేయాల్సిన బాధ్యత సీఎం కిరణ్, ఆ ప్రాంత మంత్రులదేనని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా టి.ఎన్జీవోలు గతంలో చేపట్టిన సమ్మెను విరమించుకోవాలని తాము కోరిన సంగతిని జానారెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు. రాష్ట్ర విభజనకు సహకరించకుండా సీమాంధ్ర ఉద్యోగులు, నేతలు రెచ్చిపోతే పరిస్థితులు మరింత జఠిలమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. దాంతో తెలుగు ప్రజల మధ్య సామరస్యం దెబ్బ తినే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవన్న భరోసా ఉంటేనే హైదరాబాద్లో సభలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. సెప్టెంబర్ 7వ తేదీన తమ ఆధ్వర్యంలో నిర్వహించే శాంతి ర్యాలీకి అనుమతి ఇప్పించాలని టి.జేఏసీ నేతలు తమను కోరరాని కే.జానారెడ్డి విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.