Published
Tue, Apr 22 2014 3:17 PM
| Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
తెలంగాణ ఎవరో ఇస్తే వచ్చింది కాదు: మోడీ
నిజమాబాద్: తెలంగాణ ప్రజలకు ప్రస్తుత ఎన్నికలు చాలా కీలకమని ప్రజలకు బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ గుర్తు చేశారు. నిజమాబాద్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ.. గతంలో ఎన్నో ఎన్నికలు చూశారు.. ఓటు వేశారు కాని తెలంగాణ అభివృద్దికి ఈ ఎన్నికలు చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి అని అన్నారు. ఢిల్లీ లో ఎలాంటి ప్రభుత్వం ఉండాలో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని మోడీ పిలుపునిచ్చారు.
తెలంగాణ కోసం యువకులు బలిదానం చేస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని... ఎవరో ఇస్తే వచ్చింది కాదని మోడీ అన్నారు. తెలంగాణ యువకుల భవిష్యత్ రేఖను మారుస్తానని మోడీ అన్నారు. తెలంగాణ ప్రాంత దళిత నాయకుడు అంజయ్యను అవమానించిన పాపం రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీదేనని అన్నారు.
ఈ ప్రాంతం నుంచి ప్రధానిగా ఎన్నికైన పీవి నర్సింహరావును కూడా కాంగ్రెస్ అవమానించిందన్నారు. పీవీ జన్మదినం, వర్ధంతి రోజున పుష్పగుచ్ఛాలు కూడా ఉంచడం లేదని ఆయన అన్నారు. పీవీ పేరును నామరూపాల్లేకుండా చేసింది ఈ కాంగ్రేసేనని మోడీ ధ్వజమెత్తారు. దేశంలోనే అత్యధికంగా నిజమాబాద్ జిల్లాలో పసుపు పంట ఉత్పత్తి ఉంటుందని.. అలాంటి ఈ ప్రాంతంలో రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు.
జై జవాన్, జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి అంటే.. మర్ కిసాన్.. మర్ జవాన్ కాంగ్రెస్ నినాదమన్నారు. గుజరాత్ లోని సూరత్ లో వేలాదిమంది తెలంగాణ ప్రాంతవాసులు ఉంటారని.. వారిని తాను బాగానే చూసుకుంటానని మోడీ అన్నారు. తెలంగాణ ప్రజలను ఎలా చూసుకోవాలో తనకు అనుభవం ఉందన్నారు. తెలంగాణ ప్రజల మేలు కోసం ఢిల్లీలో బీజేపీ అధికారం అప్పగించాలన్నారు. సీమాంధ్ర కాని, తెలంగాణ కాని తెలుగు తన తల్లి లాంటిదన్నారు. అలాంటి తన తెలుగు తల్లిని కాంగ్రెస్ హత్య చేసి బిడ్డకు జన్మనిచ్చారన్నారు.
పవన్ కళ్యాణ్ తనను గుజరాత్ లో కలుసుకున్నారని.. పవన్ కళ్యాణ్ తన మనసు గెలుచుకున్నారని.. అతనిలాంటి వ్యక్తి ఉంటే తెలుగు స్ఫూర్తి చచ్చిపోదన్నారు. ఉంటే తెలుగు సంస్కృతిని కాపాడే సత్తా పవన్ కళ్యాణ్ లో ఉందన్నారు.