సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ బిల్లుపై చర్చను సాగదీస్తున్న వైఖరిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి వివరించాలని తెలంగాణ మంత్రులు నిర్ణయానికొచ్చారు. అసెంబ్లీ లాబీలోని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పంచాయతీరాజ్ మంత్రి కె.జానారెడ్డి కార్యాలయాల్లో గురువారం పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో దఫదఫాలుగా సమావేశమయ్యారు. బిల్లును అడ్డుకునేందుకే సమావేశాలను సాగదీస్తున్నారని, ఈ ఆలస్యాన్ని ఎలా అడ్డుకోవాలన్న అంశంపై చర్చించారు. శాసనసభను పక్షం రోజులపాటు వాయిదా వేసి జనవరి 3 నుంచి 23దాకా తిరిగి కొనసాగించాలని నిర్ణయించడంలో ఆంతర్యం అదేనని వారు అభిప్రాయపడ్డారు. రాష్ర్టపతి తగినంత గడువిచ్చినప్పటికీ ఉభయ సభలను సమావేశపరచకుండా వాయిదా వేసుకుని, మరింత గడువు కోరాలన్న ఆలోచనలు సాగుతున్నాయని, ఈ విషయాన్ని రాష్ట్రపతిని కలిసి వివరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతిని రెండు మూడు రోజుల్లో కలవాలని భావిస్తున్న ఆయా నేతలు డిప్యూటీ సీఎం ద్వారా రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
నలుగురితో కమిటీ వేయండి
ప్రభుత్వ ఉద్యోగుల విభజన పారదర్శకంగా ఉండేలా నలుగురు సీనియర్ అధికారులతో కమిటీని నియమించాలని టీఎన్జీవోల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డిలతో కూడిన ప్రతినిధి బృందం గురువారం సచివాలయంలో సీఎస్‌ను కలిసి తమ డిమాండ్ గురించి తెలిపింది.