సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను తిరస్కరించాలని కోరుతూ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లేకుండా ప్రభుత్వం పక్షాన స్పీకర్‌కు కిరణ్‌కుమార్‌రెడ్డి నోటీస్ ఇవ్వడంపై తెలంగాణ మంత్రులు ఆగ్రహంతో ఉన్నారు. అయినప్పటికీ దీనిపై తొందరపాటు నిర్ణయానికి రాకూడదని భావించిన తెలంగాణ మంత్రులు ఈ విషయంలో హైకమాండ్ దిశానిర్దేశం కోసం ఎదురుచూస్తున్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానానికి అనుకూలంగా యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన బిల్లు పంపితే, దానిని తిరస్కరించాలని చెప్పడమంటే కాంగ్రెస్ పార్టీని ధిక్కరించడమే అవుతుందని, దీనికి చెక్‌పెట్టేందుకు హైకమాండ్ పెద్దలు వ్యూహం రూపొందిస్తారనే భావనలో ఉన్నారు. హైకమాండ్ పిలుపు మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అధిష్ఠానం నుంచి వచ్చే ఆదేశాల మేరకే సభలో వ్యవహరించాలని తెలంగాణ నేతలు భావిస్తున్నారు.
ఢిల్లీ నుంచి జానారెడ్డి హైదరాబాద్ వచ్చిన అనంతరం అందుబాటులో ఉన్న తెలంగాణ ప్రజాప్రతినిధులంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని యోచిస్తున్నారు. తెలంగాణ బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టడం, ఆమోదించడం ఖాయమైన నేపథ్యంలో అసెంబ్లీలో బిల్లుపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమైనా నష్టమేమీ లేదని పలువురు నేతలు భావిస్తున్నారు. అలాగని శాసనసభ విభజన బిల్లును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించి కేంద్రానికి పంపితే రాష్ట్రపతి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అంతవరకు రాకుండా ఉండాలంటే సీఎం తీర్మానం పెట్టకుండా అడ్డుకోవడమే మేలని అభిప్రాయపడుతున్నారు. జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విభజన తీర్మానాన్ని తిరస్కరించాలని కోరుతూ సీఎం నోటీస్ ఇచ్చిన విషయంపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామన్నారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరుతూ గవర్నర్, శాసనసభ స్పీకర్‌లకు లేఖ కూడా రాస్తున్నట్లు పేర్కొన్నారు. కిరణ్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీఎం పదవికి రాజీనామా చేసి విభజన బిల్లును వ్యతిరేకిస్తే మంచిదని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.