తెలంగాణ మంత్రులకు దిగ్విజయ్ ఫోన్
హైదరాబాద్ : తెలంగాణ ప్రాంత మంత్రులకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సోమవారం ఫోన్ చేశారు. కేబినెట్ సమావేశానికి హాజరు కావాలని ఆయన ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులను ఆదేశించారు. బడ్జెట్ సమావేశాలు రాజ్యాంగ ప్రక్రియ కాబట్టి హాజరు కావాలని సూచించారు. సమావేశాలకు ఆటంకం కలిగించకూడదని అన్నారు. తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోందని, అందుకు ఎటువంటి అడ్డంకులు లేవని దిగ్విజయ్ స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం 9గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనున్న విషయం తెలిసిందే.
కాగా ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, టీ. మంత్రులను పట్టించుకోవటం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. దిగ్విజయ్ కొందరు మంత్రులకు ఫోన్ చేశారని...సీఎంకు సహకరించాలా ....వద్దా... అనేదానిపై తాము చర్చించుకున్న అనంతరం కేబినెట్ భేటీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు మంత్రి జానారెడ్డి నివాసంలో సమావేశం అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.