డైలీ సీరియల్లా టీ-మంత్రుల అబద్ధాలు: పరకాల
తెలంగాణ మంత్రులు అబద్ధాలను సీరియల్లా చెబుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ విమర్శించారు. 233 జీవోలో ఎక్కడా 834 అడుగుల వరకు నీరు వాడుకోవచ్చనే పదమే లేదని ఆయన అన్నారు. చెప్పిన అబద్ధాలనే వాళ్లు మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. 107 జీవోకు, 170 జీవోకు మధ్య తేడా ఏంటో హరీష్రావుకు తెలియదా అని ప్రశ్నించారు. ఒకదానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడుతున్నారని, అబద్ధాల డైలీ సీరియల్ను ఇకనైనా ఆపాలని పరకాల ప్రభాకర్ అన్నారు. మీ నీటిని మీరు వాడుకుంటే తమకు అభ్యంతరం లేదని, అంతేతప్ప.. తమకు రావల్సిన న్యాయబద్ధమైన వాటాలో కూడా వేలు పెడితే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.
ఇక విద్యుత్తు విషయంలో కూడా.. తమకు వెయ్యి మెగావాట్లు రావాలని అడుగుతున్నారని, అవి ఎక్కడినుంచి రావాలని ప్రశ్నించారు. దానికి ఏమైనా లెక్క ఉందా.. ఎక్కడెక్కడ రావల్సిన దానికన్నా అదనంగా తీసుకుంటున్నారో కూడా లెక్కలు చెబుతానని అన్నారు. థర్మల్ విద్యుత్తులో ఏపీ ఉత్పత్తి చేసిన దాంట్లోంచి 769 మిలియన్ యూనిట్లు తెలంగాణకే ఇచ్చామని ఆయన చెప్పారు. జల విద్యుత్తులో కూడా ఆంధ్రా డిస్కంలు 1621, తెలంగాణ డిస్కంలు 2224 మిలియన్ యూనిట్ల చొప్పున వాడుకున్నాయన్నారు. ఇలా అన్నిచోట్లా ఎక్కువ వాడుకుంటూ.. తమ మీద తప్పునెట్టడం తెలంగాణ మంత్రులకు తగదని పరకాల ప్రభాకర్ చెప్పారు.