
అసెంబ్లీలో ప్రసంగిస్తున్న ఈటెల రాజేందర్
తెలంగాణ ప్రజలకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆదర్శమని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ తెలిపారు. పొట్టి శ్రీరాములు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమని, ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు పోరాడారని గుర్తు చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు సందర్భంగా జరిగిన చర్చలో భాగంగా ఈటెల మాట్లాడుతూ... 60 ఏళ్ల నిరీక్షణ ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాకారం అవుతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు.
నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల పక్షాన పోరాడిన టీఆర్ఎస్ తరఫున బిల్లును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఏనాడూ తెలంగాణ ప్రజల మనస్సును దోచుకునే పని ఒక్కటి కూడా ఆంధ్ర పాలకులు చేయలేదని ఆయన గుర్తు చేశారు. ఇంతకాలం అన్నదమ్ముల్లా కలసి ఉన్నామని, రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అలాగే ఉందామని ఈటెల చెప్పారు. తెలంగాణ ఉద్యమం సంకుచితమైంది కాదని ఈటెల రాజేందర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణకు మద్దతిచ్చేవారు సీమాంధ్రలో కూడా ఉన్నారని ఈటెల గుర్తు చేశారు.