
తెలంగాణ భవన్ కు చేరుకున్న కేసీఆర్ ర్యాలీ
హైదరాబాద్: హైదరాబాద్ లో భారీ జనసందోహం మధ్య సాగుతున్న తెలంగాణ విజయోత్సవ ర్యాలీ తెలంగాణ భవన్ కు చేరుకుంది. తెలంగాణ వాదులు, టీఆర్ ఎస్ శ్రేణులతో నగర వీధులు జనసంద్రమయ్యాయి. ఐదు గంటల పాటు విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక వాహనంలో సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బేగంపేట నుంచి ర్యాలీగా బయలుదేరారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణవాదులు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. సోమాజిగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, రవీంద్రభారతి మీదుగా గన్‌పార్క్ వరకు ర్యాలీ సాగింది.
కేసీఆర్ రాకతో హైదరాబాద్ రహదారులు గులాబీ మయం అయ్యాయి. గులాబీ దళపతిపై అడుగడునా పూల వర్షం కురిపించారు. జై తెలంగాణ నినాదాలు మార్మోగుతున్నాయి. గన్పార్క్ వద్దకు తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గన్పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ భవన్ కు వెళ్లారు. తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు కేసీఆర్ పూలమాలలు వేశారు.