తెలంగాణ ఆగదు | Telangana state will not stop | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఆగదు

Published Mon, Jan 27 2014 4:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM

Telangana state will not stop

 వనపర్తి, న్యూస్‌లైన్: ఎవరెన్ని అడ్డుంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతామని టీఆర్‌ఎస్ ఫ్లోర్‌లీడర్ ఈటెల రాజేందర్ ధీమావ్యక్తంచేశారు. ఆదివారం రాత్రి వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగిన తెలంగాణ కళాకారుల సన్మానం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రముఖ కవి, గాయకుడు గోరెటి వెంకన్నను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో తల, తోకలేని ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు.
 
 సీల్డ్‌కవర్ సీఎం ఇతరులు రాసిన స్క్రిప్టును అసెంబ్లీలో చదువుతున్నాడని ఎద్దేవాచేశారు. తెలంగాణ జానపదాలకు కొత్తనడకలు నేర్పిన ఘనత గోరెటి వెంకన్నకే దక్కిందన్నారు. ఆయన రాసిన పల్లేకన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. అన్నపాట చంద్రబాబు 9 ఏళ్ల ప్రభుత్వాన్ని నేలమట్టం చేసిందన్నారు. తెలంగాణలో కవులు, కళాకారులు, గాయకులకు కొదవలేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆటాపాటలు నడిపించాయని ప్రశంసించారు. భూమి ఉన్నంత వరకు మనిషి మనుగడ సాధించినంత వరకు తెలంగాణ కళాకారుల పాట బతికే ఉంటుందన్నారు.
 
 తెలంగాణలో కవులు, కళాకారులకు ప్రాధాన్యం
 పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కవులు, గాయకులకు ప్రత్యేకరాష్ట్రంలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. తెలంగాణ పాటను సత్కరించాలని నిరంజన్‌రెడ్డికి వచ్చిన ఆలోచన అభినందనీయమన్నారు. చంద్రబాబు, కిరణ్‌బాబు, జగన్‌బాబులు తెలంగాణను అడ్డుకోలేరని శ్రీహరి స్పష్టం చేశారు.
 
 జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు విలీనం చేశారని, ఇదే జిల్లానుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ద్వారా తెలంగాణ రాష్ట్రం వస్తుండటం ఎంతో ఆనందదాయకమన్నారు. సీమాంధ్ర కవి ఫ్రొపెసర్ కోయి కోటేశ్వర్‌రావు ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సభ చివరిలో గోరెటి వెంకన్న పాట సభికులను ఉర్రూతలూగించింది. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎస్.నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ మందా జగన్నాథం, జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల టీఆర్‌ఎస్ ఇన్‌చార్జీలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement