ఉస్మానియా మళ్లీ ఉద్రిక్తం
వంద మంది అరెస్ట్
చలో రాజ్‌భవన్ ర్యాలీ భగ్నం... బాష్పవాయు ప్రయోగం
హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ టీవీవీ ఆధ్వర్యంలో సోమవారం ఉస్మానియా విద్యార్థులు చేపట్టిన ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వర్సిటీ నుంచి సుమారు ఐదు వందల మంది విద్యార్థులు ఉదయం 10 గంటలకు ర్యాలీగా బయలు దేరారు. ఎన్‌సీసీగేటు వద్దే పోలీసులు వీరిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఆగ్రహించిన విద్యార్థులు రాళ్లు రువ్వగా,పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నాం వరకు క్యాంపస్ అట్టుడికింది. ఇదే సమయంలో కోట శ్రీనివాస్ గౌడ్ సారథ్యంలో పోలీసుల కళ్లుగప్పి రాజ్‌భవన్‌కు చేరుకున్న సుమారు వంద మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఘోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.సాయంత్రం తెలంగాణా విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు రాజ్‌భవన్ వద్దకు చేరుకోగా పోలీసులు 13 మందిని అరెస్ట్ చేసి గోల్కొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని విద్యా ఉపాధి అవకాశాలు ఇక్కడి అభ్యర్థులకే కల్పించాలని లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని టీవీవీ నేతలు ఆజాద్, బండారు వీరబాబు, ప్రేమ్‌కుమార్‌గౌడ్, కోట శ్రీనివాస్‌గౌడ్‌లు హెచ్చరించారు.అరెస్టయిన వారిలో సర్దార్‌సింగ్ రాథోడ్,గుర్రం రమేశ్, కస్తూరి శ్రీనాథాచారి,పూదరి హరీశ్, గడ్డం వెంకటేశ్,బాణావత్ సంతోష్‌నాయక్ తదితరులున్నారు.