
చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతల భేటీ
అమరావతి: టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం తెలంగాణ టీడీపీ నేతలు మంగళవారం అమరావతిలో సమావేశమయ్యారు. ముందస్తు ఎన్నికలు.. ఎన్నికల పొత్తులు తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ అనుసరిస్తోన్న వైఖరిపై భేటీలో పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒకలాగా... తెలంగాణలో మరోలా బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నప్పుడు ఒకే విధానాన్ని అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
బీజేపీ వైఖరిపై స్పష్టత తీసుకోవాలని చంద్రబాబును కోరారు. అయితే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ తరహా ఇబ్బందులు సహజమేనని ఆయన సర్దిచెప్పినట్లు సమాచారం. ఏ పార్టీకాపార్టీ బలపడాలనే ప్రయత్నం చేయడం సహజ పరిణామమని పేర్కొన్నారు. ఆ పార్టీ హైకమాండ్‌తో మాట్లాడతానని వారికి హామీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున్న ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా నేతలకు సూచించారు.
నియోజకవర్గాల పెంపు త్వరలో జరగనుందన్న చంద్రబాబు తెలిపారు. మహానాడులో చర్చించాల్సిన అంశంపై తెలంగాణ స్థాయిలో ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసుకోవాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 24వ తేదీన తెలంగాణ ప్రతినిధుల సభను తలపెట్టారు. ఈ సభకు రావాల్సిందిగా చంద్రబాబును నేతలు ఆహ్వానించారు.