- నందిగామ ఉప ఎన్నిక ప్రచారంలో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా
నందిగామ : దగాకోరు ప్రభుత్వానికి ఉప ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం మహిళా రైతు, డ్వాక్రా మహిళల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి రావడానికి అన్ని అడ్డదారులు తొక్కారని విమర్శించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారన్నారు.
తెలుగుదేశం నాయకులు, మంత్రులు ఎక్కడికి వెళ్లినా ఆ జిల్లాను ‘స్వర్ణాంధ్ర, స్వర్ణ జిల్లాలు’గా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ‘రుణాలు మాఫీ చేయకపోతే బ్యాంకులు మహిళల బంగారాన్ని వేలం వేస్తాయని, అప్పుడు ఆ బంగారం తీసుకుని రోడ్ల వెంబడి స్ప్రే చేయడమే స్వర్ణాంధ్ర’ అని టీడీపీ నేతలు భావిస్తున్నారని విమర్శించారు. తన మాటలను అర్థం చేసుకుని ఉప ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి దగాకోరు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మహిళలను రఘువీరారెడ్డి కోరారు.
అనంతరం సార్వత్రిక ఎన్నికల సమయంలో రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు చెబుతున్న మాటలను రికార్డు చేసిన ఆడియో క్యాసెట్‌ను ప్రదర్శించారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మేలు మరే ప్రభుత్వమూ చేయలేదని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడపాటి బాబూరావును గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ నందిగామ నియోజకవర్గ ఇన్‌చార్జి వేల్పుల పరమేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు దేవినేని నెహ్రూ, కొండ్రు మురళీ, డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, ఆ పార్టీ అభ్యర్థి బోడపాటి బాబూరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్, నాయకులు సుధాకర్‌రావు, పాలేటి సతీష్, బొబ్బెళ్లపాటి గోపాలకృష్ణసాయి, వెలగలేటి రామయ్య, సుంకర పద్మశ్రీ, షేక్ జాఫర్, శివాజీ, తలమాల డేవిడ్‌రాజు, ఆకుల శ్రీనివాసరావు, కామ శ్రీను పాల్గొన్నారు.
ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు : మాజీ మంత్రి కన్నా
నందిగామ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. నందిగామలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏదో ఒక సాకు చెబుతూ హామీల అమలులో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా రుణమాఫీ ఎలా సాధ్యమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు మోసాన్ని గుర్తించి ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.