సాక్షి, చిత్తూరు : తెలుగుభాషకు వన్నె తెస్తానని రాష్ట్ర విభజన తరువాత ఏర్పాటైన తెలుగు అకాడమికి తొలి డైరెక్టర్‌గా నియమితులైన ఎస్వీయూనివర్సిటీ ప్రొఫెసర్ పేట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. సంయుక్త రాష్ట్రంలో 1968లో తెలుగు అకాడమిని ఏర్పాటు చేశారు. తెలుగుభాషాభివృద్ధి, వ్యాప్తికి తెలుగు మాధ్యమంలో పుస్తకాలు ముద్రించేందుకు తెలుగు అకాడమిని ఏర్పాటు చేశారు.
దీనికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తొలి డైరెక్టర్‌గా నియమితులై 6 సంవత్సరాలుపాటు సేవలు అందజేశారు. 2014లో రాష్ట్రం విడిపోయాక తెలుగు అకాడమి తెలంగాణాలో ఉండిపోయింది. టీడీపీ ప్రభుత్వం ఏపీలో తెలుగు అకాడమి ఏర్పాటుకు ఏమాత్రం ప్రయత్నించలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాత ఏపీలో తెలుగు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తెలుగు అకాడమీ చైర్మన్‌గా లక్ష్మీపార్వతిని గత నెల 16న నియమించారు. తాజాగా ఈ సంస్థ డైరెక్టర్‌గా ఎస్వీయూ ప్రొఫెసర్ పేట శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశ్న : మీ కుటుంబ నేపథ్యం?
జవాబు : మాది తిరుపతిని బండ్ల వీధి. మా నాన్న పేట నారాయణరెడ్డి. ఆంధ్రాబ్యాంక్‌లో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. అమ్మ చెంగమ్మ. బాల్యం అంతా తిరుపతిలోనే గడిచింది.
ప్రశ్న : బీకాం చదివి తెలుగు ఎందుకు ఎంచుకున్నారు?
జవాబు : నేను పదవ తరగతి చదివే సమయంలో ఎస్వీయూ తెలుగు ప్రొఫెసర్ జీఎన్ రెడ్డి రచించిన తెలుగు నిఘంటువు బాగా ఆకర్షించింది. దాన్ని చూసి తెలుగు పట్ల ఆసక్తి పెంచుకున్నాను. డిగ్రీలో ఒక సందర్భంలో ఆయన తెలుగుపై మా కళాశాలలో ప్రసంగించారు. దీంతో తెలుగుపట్ల ఆకర్షితుడినై బీకాం అనంతరం ఎంఏ తెలుగు చేశాను.
ప్రశ్న : మీ ఉద్యోగ జీవితం?
జవాబు : ఎస్వీయూ తెలుగు అధ్యయన శాఖలో పీహెచ్‌డీ చేశాను. 1992లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి 2007లో ప్రొఫెసర్ అయ్యాను. డీన్‌గా విభాగాధిపతిగా వివిధ హోదాల్లో పనిచేశాను.
ప్రశ్న : ఇప్పటి వరకు ఎన్ని రచనలు చేశారు ?
జవాబు : ఇప్పటి వరకు 20 పుస్తకాలు రచించాను. తిరుపతి కథలు, కొండకథలు, గంగజాతర పుస్తకాలు ఎంతో పేరు తెచ్చాయి. ఆంధ్రప్రభ, వీక్లీలో తిరుపతి కథలు ప్రచురితం అయ్యాయి. దానిపై పుస్తకం తెస్తున్నాను. అలాగే తిరువీధులు పుస్తకం ద్వారా తిరుపతి నగరాన్ని గురించి వివరిస్తూ రచన చేశాను.
ప్రశ్న : ఎన్ని అవార్డులు అందుకున్నారు?
జవాబు : నేను ఇప్పటి వరకు 17 అవార్డులను పొందాను. 2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ టీచర్ అవార్డు, 2014లో తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం ముఖ్యమైనవి. అలాగే పలు అకడమిక్ సంస్థల్లో సభ్యుడిగా ఉన్నాను. 23 పీహెచ్‌డీ డిగ్రీలకు మార్గదర్శనం చేశాను.
ప్రశ్న : తెలుగు అకాడమికి ఎలాంటి సేవ చేస్తారు?
జవాబు : తెలుగు అకాడమి డైరెక్టర్‌గా నియమితులు కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అకాడమికి చైర్మన్‌గా ఉన్న లక్ష్మీపార్వతి కూడా ఎంఏ పీహెచ్‌డీ తెలుగులో చేశారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం తెలుగు అకాడమిని పట్టించుకోలేదు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు అకాడమి ఏర్పాటు చేయడం తెలుగు భాషాభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధి అవగతమౌతుంది. తెలుగుభాష వ్యాప్తికి, చిత్తశుద్ధితో పనిచేస్తాను. హైదరాబాద్‌లో ఉన్న తెలుగు అకాడమిని విభజించి ఏపీలో తెలుగు అకాడమిని సుస్థిర పరుస్తాను. తెలుగుకు సంబంధించిన పుస్తకాలను మంచి రచయితలతో రచనలు చేయించి అందుబాటులోకి తెస్తాను. అందరికీ తెలుగు పట్ల ఆసక్తి కలిగేలా చేస్తాను.
ప్రశ్న : ఇంగ్లిష్ మీడియం ప్రభావంతెలుగుపై ఉంటుందా?
జవాబు : రాష్ట్రంలో తెలుగు ప్రొఫెసర్లు అంతా ఆంగ్లమాధ్యమంలోనే చదువుతున్నారు. ఏపీ సీఎం తెలుగుమీడియం స్థానంలో ఆంగ్లమాధ్యమం ప్రవేశ పెట్టి మంచినిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల పేదలకు ఆంగ్లంలో చదువుకునే అవకాశం వచ్చింది. ఇంగ్లిష్ మీడియం పెట్టినంత మాత్రాన తెలుగు నిర్లక్ష్యానికి గురికాదు.
బయోడేటా
పేరు: పేట శ్రీనివాసరెడ్డి
హోదా: ఎస్వీయూ ప్రొఫెసర్
విద్యాభ్యాసం: ఎంఏ, పీహెచ్‌డీ
రచనలు: 20
పేరుతెచ్చినవి: కొండ కథలు, తిరువీధులు, గంగజాతర, తిరుపతి కథలు
అందుకున్న అవార్డులు: 20
Comments
Please login to add a commentAdd a comment