సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఏడాది క్రితం గద్దెనెక్కిన టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు నామినేటెడ్ పదవులుపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఏడాది గడచినా తమల్ని పట్టించుకోలేదంటూ తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తితో ఊగిపోతున్నారు. టీడీపీలో బడానేతలుగా చెప్పుకునే వారందరూ పదవులు పొందడంతో కార్యకర్తలను మరిచారంటూ మండిపడుతున్నారు.
కడుపు నిండిన వారు ఇతరుల ఆకలి ఎరుగురన్న చందంగా ఉందని ఓ వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు నాయకులు గురించి సెటైర్లు వేయడం కనిపించింది. కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారనే విషయం గ్రహించిన నేతలు కొందరు కార్యకర్తలను బుజ్జగించే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఇటీవల జిల్లా వ్యాప్తంగా మండలస్థాయి సమావేశాలు ఏర్పాటు చేశారు.
ఆ సమావేశాల్లో అనేకచోట్ల కార్యకర్తలు నాయకుల తీరుపై మండిపడ్డారు. తడలో అయితే ఇరువర్గాలుగా చీలిపోయి కొట్టుకున్నారు కూడా. అదేవిధంగా నెల్లూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు సైతం సమావేశం ఏర్పాటు చేసి మేయర్ అజీజ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమల్ని పట్టించుకోలేదని మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులుకు తెలిసినా వారుకూడా పట్టించుకోకపోవడంతో కొందరు కార్పొరేటర్లు బహిరంగంగానే విమర్శలు దిగారు. ఆలస్యం చేస్తే అభాసుపాలవుతామని తెలుసుకున్న జిల్లా పార్టీ కార్యకర్తల ఆగ్రహాన్ని చల్లార్చేపనిలో పడ్డారు.
దీంతో కార్పొరేటర్లతో గురువారం సమావేశం కూడా ఏర్పాటు చేసి వారికి నచ్చజెప్పి పంపినట్లు తెలిసింది. జిల్లాలో 11 మార్కెట్, దేవాలయ కమిటీలు, నుడా, ఆర్టీసీ, గ్రంధాలయం, వక్ఫ్‌బోర్డు, రాష్ట్రస్థాయిలో ఆప్కో, శాప్ తదితర నామినేటెడ్ పదవులును భర్తీ చేయాల్సి ఉంది. జిల్లాలో కావలి, నెల్లూరు, వెంకటగిరి, ఉదయగిరి, ఆత్మకూరు మార్కెటింగ్ కమిటీలను మాత్రం ప్రకటించి చేతులు దులుపుకున్నారు. సూళ్లూరుపేట, నా యుడుపేట, గూడూరు, కోవూరు, సర్వేపల్లి, పొదలకూరు మార్కెటింగ్ కమిటీల నియామకం ఆగిపోయింది. ఈ పదవులు దక్కించుకునేందుకు పలువురు పోటీ పడుతున్నారు. అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ పదవి కోసం కిలారి వెంకటస్వామినాయుడు, పమిడి రవికుమార్‌చౌదరి మధ్య పోటీ నెలకొంది. గ్రంధాలయ కమిటీ చైర్మన్ కోసం శేఖరరెడ్డి, కోటేశ్వరరెడ్డి, మలిశెట్టి వెంకటేశ్వర్లు, గూడూరు రఘునాథరెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, రమణయ్య ప్రయత్నించి చాలించుకున్నారు.
నుడా పదవికి తీవ్ర పోటీ
ఇకపోతే నెల్లూరు నుడా పదవికి తీవ్రమైన పోటీ ఉంది. ఆ మధ్య నూడా చైర్మన్ ఖరారైందని ప్రచారం జరిగింది. ఆ పదవి కోసం తాళ్లపాక అనూరాధ, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జెడ్ శివప్రసాద్ ప్రయత్నిస్తున్నారు.
మరో వైపు బీజేపీకి కేటాయించాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్ కోసం మున్వర్, మేయర్ అజీజ్ సోదరుడు జలీల్ ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు దక్కించుకునేందుకు పలువురు పోటీ పడ్డారు. వీటిలో ఏ ఒక్క టీ ప్రకటించకపోవడంతో పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ, నామినేటెడ్ పదవులు ప్రకటించకపోవడానికి జిల్లా నాయకులే కారణమని తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమన్వయ కమిటీ ఏర్పాటు
జిల్లాలో పార్టీ కమిటీలతో పాటు, నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు రాష్ట్ర పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మంత్రి నారాయణ, ఆదాల ప్రభాకరరెడ్డి, బీద రవిచ ంద్రను నియమించారు. వీరు కలసి చర్చించి కమీటీల నియామకం చేపట్టాల్సి ఉంది.
అయితే మంత్రి నారాయణ రాజధాని నిర్మాణానికే పరిమితమయ్యారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్రకు ఇటీవలే ఎమ్మెల్సీ పదవులు లభించాయి. ఆదాల సొంత వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. దీంతో నలుగురు నేతలు ఒకచోట కూర్చొని చర్చించే అవకాశం పూర్తిగా కొరవడింది.
ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. దీంతో ‘మీకు పదవులు ఉంటే సరిపోతుందా, మా పదవులు సంగతిని తేల్చండి’ అంటూ కొంతమంది తెలుగు తమ్ముళ్లు టీడీపీ సమావేశాల్లో బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యనేతలు జిల్లాలోనే తిష్టవేసి గ్రామాల్లో పర్యటిస్తూ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి బుజ్జిగించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. అధినేత చంద్రబాబును సమస్యలు చుట్టుముట్టాయని, కొద్దిరోజులు ఓపిక పట్టాలని సర్దిచెపుతున్నట్లు టీడీపీ శ్రేణులు వెల్ల్లడించాయి.
తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి
Published Sat, Jul 18 2015 2:02 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM
Advertisement
Advertisement