అమెరికాలో తెలుగు దంపతులు మృతి
► ఇండియానా విమాన ప్రమాదంలో దుర్మరణం
► నలభై ఏళ్ల క్రితం వెళ్లి అక్కడే స్థిరపడ్డ భార్యాభర్తలు
► మచిలీపట్నంలో విషాదఛాయలు
కోనేరుసెంటర్ (మచిలీపట్నం): అమెరికాలోని ఇండియానాలో జరిగిన విమాన ప్రమాదంలో కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నానికి చెందిన దంపతులు కలపటపు ఉమామహేశ్వరరావు, సీతాగీత మృతిచెందారు. శనివారం గల్లంతయిన ఈ విమానాన్ని గాలింపు బృందాలు మంగళవారం గుర్తించాయి. ఈ విషయం తెలియడంతో మచిలీపట్నంలో విషాదఛా యలు అలముకున్నాయి. అమెరికాలోని ఇండియానాలో వైద్య వృత్తిలో స్థిరపడిన ఉమామహేశ్వరరావు దంపతులు నలభై ఏళ్ల క్రితం అమెరికా వెళ్లారు. వీరు అక్కడి నుంచి ఇక్కడే ఉన్నా చిన్ననాటి స్నేహితులు, బంధువులతో ఇప్పటికీ సంబంధాలు కొనసాగిస్తున్నారు.
ఉమామహేశ్వరరావు దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తలు సైక్రియాటిస్ట్‌లుగా అమెరికాలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఉమామహేశ్వరరావు తండ్రి అప్పారావు జడ్జిగా పనిచేశారు. అప్పారావుకు ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కాగా, పుత్ర సంతానంలో ఉమామహేశ్వరరావు ఆఖరి వాడు. ఉమామహేశ్వరరావు భార్య సీతాగీత వీణలో మంచి ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. దంపతులు ఇద్దరు ఇండియా వచ్చిన ప్రతిసారి ఆమె మచిలీపట్నంలోని అనేక క్లబ్‌ల తరపున పలు కార్యక్రమాలు నిర్వహిం చి అందరి మన్ననలు అందుకున్నారు.
ఉమామహేశ్వరరావు కుమారుల్లో ఒకరు గుంటూరులో స్థిరపడగా, మరో కుమారుడు, కుమార్తె వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు వారి సన్నిహితుడు యెండూరి సురేష్ తెలిపారు. అమెరికాలో స్థిరపడినప్పటికీ మచిలీపట్నంతో మంచి సత్సంబంధాలు నడిపిన ఉమామహేశ్వరరావు, సీతాగీతల అకాల మరణం తమకు తీరని విషాదాన్ని మిగిల్చిందని సురేష్ మరి కొంత మంది స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు ఉమామహేశ్వరరావు ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా పుట్టిన గడ్డ మీద మమకారం చంపుకోలేక బలరామునిపేటలోని తండ్రి కష్టార్జితమైన ఇంటిని కొంత కాలం క్రితం అధిక రేటుకు కొనుగోలు చేశారు.