
తెలుగును విశ్వవ్యాప్తం చేద్దాం
అధికార భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్
కర్నూలు, న్యూస్‌లైన్: గ్లోబలీకరణను సానుకూలంగా ఉపయోగించుకుని తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేయాలని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కర్నూలులో రెండు రోజులపాటు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన ముఖ్య ప్రసంగం చేస్తూ తెలుగు భాషపై తెలుగు పాలకులకు, నేతలకు మమకారం తగ్గడంతోనే రాష్ట్రం విభజన జరిగిందన్నారు. గ్లోబలీకరణతో దేశంలోని అన్ని మాతృభాషలు ప్రమాదపుటంచుల్లో పడిపోయాయన్నారు.
మారిషస్‌లో తెలుగు ప్రజలు ఇప్పటికీ మన సంస్కృతీ సంప్రదాయాలను పాటించడం అభినందనీయమన్నారు. అనంతరం మారిషస్ ఆంధ్ర లలిత కళా సమితి అధ్యక్షులు సంజీవ నర్సింహ అప్పడు కర్నూలు మట్టిని తమ దేశానికి తీసుకెళ్లి మారిషస్ మట్టితో కలిపి ఆరడుగుల తెలుగుతల్లి విగ్రహాన్ని నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో చైనా, నైజీరియా, ఇరాన్, పోలండ్ తదితర దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.