బాసర, న్యూస్‌లైన్ : ఆయన అమ్మవారి భక్తుడు.. ఆమె దర్శనం లేనిదే పచ్చి నీళ్లయినా ముట్టడు.. ఆయనతోపాటు తన కుటుంబం సరస్వతీ సేవలోనే తరించింది.. ఆలయ ధర్మకర్త అయ్యాడు.. దేవాలయ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశాడు.. ఆలయ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింప జేశాడు.. నయాపైసా కూడా ఆశించలేదు.. చివరకు విధి వక్రీకరించి అందరిని పోగొట్టుకున్నాడు.. ఉన్నవారి నిరాదరణకు గురయ్యాడు.. బాసర ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్నాడు.. అతడే బాసరకు చెందిన లక్ష్మణ్! బాసరకు చెందిన లక్ష్మణ్ రెండు దశాబ్దాల క్రితం బాసర సరస్వతీ ఆలయ ధర్మకర్తగా పనిచేశారు.
మాజీ ఎమ్మెల్యే గడ్డెన్న ఆలయ చైర్మన్‌గా ఉన్నకాలంలో లక్ష్మణ్‌తోపాటు మరో 12 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండున్నరేళ్లు ఆలయ ధర్మకర్తగా పనిచేశాడు. ఆయన హయాంలో రెండంతస్తుల ధర్మశాల, ఒక అతిథి గృహం ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యం కూడా కల్పించారు. మూడు నెలలకోసారి సమావేశం ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చూసేవారు.
శివరాత్రి, అమ్మవారి నవరాత్రోత్సలు, జన్మదినోత్సవాలను ఆయనే దగ్గరుండి చేయించేవారు. పదవీ ఉన్నప్పుడు నయాపైసా ఆశించకుండా ఆలయ అభివృద్ధికి పాటుపడ్డాడు. కాలక్రమేణ బాసరలో మార్పులు వచ్చాయి. ఆయన పదవీ కాలం కూడా ముగిసింది.
అదే ఆలయం వద్ద భిక్షాటన
పదవీ పోయిన కొన్నేళ్లకు లక్ష్మణ్ భార్య లక్ష్మి అకాల మరణం చెందింది. వీరి ఇద్దరు కొడుకులు పెద్ద విశ్వనాథ్, నగేశ్‌లతో కొన్ని రోజులు లక్ష్మణ్ ఉన్నాడు. పెద్దకొడుకు కూడా అనారోగ్యంతో చనిపోయాడు. అతని భార్య ఇద్దరు పిల్లను తీసుకుని వారి పుట్టింటికి వెళ్లింది. ఇక చిన్న కుమారుడికి పిల్లలు లేకపోవడం తండ్రిని పట్టించుకోకపోవడంతో ఆలయ అధికారులను లక్ష్మణ్ పనిఇప్పించాలని అడిగారు. ఆలయ అధికారులు మూడేళ్ల క్రితం వరకు రూ.3వేల జీతంతో ఎన్‌ఎంఆర్‌గా పనిచేశాడు.
ఆరోగ్యం క్షీణించడం, పనిచేసే స్థోమత లేకపోవడంతో ఎన్‌ఎంఆర్ నుంచి అధికారులు తొలగించారు. ఎటూపోయే దారిలేక ఆలయం వద్దే భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఎవరైనా భిక్షవేస్తే తిన్నట్లు లేకపోతే కడుపుమాడినట్టే.
నెలకు రూ.500 ఇవ్వండి.. : లక్ష్మణ్
నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. ప్రభుత్వం పింఛన్ రూ.200 ఇస్తుంది. ఇవి సరిపోవడం లేదు. మందులకే డబ్బులు అవుతున్నాయి. పనిచేయలేని స్థితిలో ఉండటంతో భిక్షాటన చేస్తున్నా. ఆలయ అధికారులు స్పందించి నెలకు రూ.500 ఇస్తే బాగుంటుంది.
నాడు ధర్మకర్త..నేడు యాచకుడు..
Published Thu, Jan 23 2014 5:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM
Advertisement
Advertisement