సాక్షి, విజయవాడ: డబ్బునోళ్లు ఎక్కువ రేట్లు పెట్టి దైవ దర్శనం టిక్కెట్లు కొనటం, విరాళాలు ఇవ్వడంతోనే మన దేవాలయాలు బ్రహ్మాండంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దుర్గగుడిలో అమ్మవారి అంతరాలయం దర్శనం టికెట్‌ను రూ.300కి పెంచడాన్ని ఆయన సమర్ధించారు. బుధవారం అమ్మవారి జన్మ నక్షత్రం మూలనక్షత్రం సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు.
దసరా ఉత్సవాలు రాష్ట్ర పండుగ గనుక ప్రభుత్వం తరఫున ఎంత డబ్బులిచ్చారని ప్రశ్నిస్తారే తప్ప ఎంత బాగా ఏర్పాట్లు చేశారనేది చూడటం లేదని విలేకరులను సీఎం విమర్శించారు. విలేకరులు మారాలంటూ సలహా ఇచ్చారు. దేవాలయాలకు డబ్బులుండబట్టే భక్తులకు మెరుగైన సేవలు అందుతున్నా యన్నారు. తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న, కాళహస్తీశ్వరుడు, సింహాచలం అప్పన్న, అన్నవరం దేవాలయాలకు డబ్బుల కొరత లేదని, మేనేజ్‌మెంట్ కొరతే ఉందన్నారు.
మరో రూ.42 వేల కోట్లు కావాలి: పోలవరం పూర్తి చేసేందుకు మరో రూ. 42 వేల కోట్లు అవసరమని సీఎం చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు 1.4.2014కి ముందు ఖర్చుచేసిన నిధులు ఇవ్వబోమని, అప్పటి ఎస్‌ఎస్‌ఆర్ రేట్లను బట్టి డబ్బులు ఇస్తామని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారన్నారు.
పోటెత్తిన భక్తకోటి....: మూల నక్షత్రం రోజు సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవార్ని దర్శించుకునేందుకు భక్తకోటి పెద్ద ఎత్తున తరలి రావటంతో 5 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు కిటకిటలాడాయి.
డబ్బున్నోళ్ల వల్లే.. ఆలయాలు బ్రహ్మాండం: సీఎం
Published Thu, Sep 28 2017 12:37 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement