గణిత అష్టావధానంలో పాల్గొన్న వరదా రాజ్ రిజ్వన్
సాక్షి, పార్వతీపురం(విజయనగరం) : ఆ కుర్రాడికి పట్టుమని పన్నెండేళ్లు నిండలేదు. పెద్దపెద్ద చదువులు చదువలేదు. గణితంలో వయసుకు మించిన ప్రతిభ చూపుతున్నాడు. లెక్కల తికమకలను క్షణాల్లో ఛేదిస్తున్నాడు. అందరినీ ఆలోచింపజేస్తున్నాడు. ఆ బాలుడే..పార్వతీపురం పట్టణానికి చెందిన వరదా రాజన్, సంధ్యల ముద్దుబిడ్డ రాజ్ రిజ్వన్. ప్రస్తుతం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. లెక్కల్లో మాత్రం బాల మేధావిగా గుర్తింపు తుచ్చుకున్నాడు. వేద గణితంలో మంచి పట్టు సాధించాడు. గణిత అష్టావధానంలో పాల్గొనే స్థాయికి చేరుకున్నాడు.
కట్టి పడేసిన గణిత అష్టావదానం....
పట్టణంలోని కన్యకాపరమేవ్వరి కల్యాణ మండపంలో వాకర్సు క్లబ్ వారు నిర్వహించిన గణిత అష్టావధానంలో రాజ్ రిజ్వన్ పాల్గొని ప్రతిభ కనబడిచాడు. ఎనిమిది మంది గణిత ఉపాధ్యాయులు, మేధావులు వేసే ప్రశ్నలు చేధించి ఔరా అనిపించాడు. శాశ్వత క్యాలెండర్‌లో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల వరకు ఏదో ఒక డేట్ చెబితే ఆ వారం పేరు చెప్పడం.. క్యూబ్ రూట్ (ఘన మూలం) ఆరంకెల సంఖ్య వరకు చెప్పడం, మాయా చదరం(4/4)ను ఇచ్చిన మూడంకెల సంఖ్యకు అనుగుణంగా ఏ వైపు నుంచి లెక్కించినా ఒకే సంఖ్య ముప్‌పై రకాలుగా రాబట్టడం ఇతని నైజం.
మనస్సంకలనం.. పది వరుస సంఖ్యలను (ముడంకెలు) తీసుకుని కూడితే ఆ సంఖ్యలు చెబితే మొత్తం విలువ చెప్పుడం, విలువ చెబితే ఆ సంఖ్యలను చెప్పడం బాలుడి జ్ఞాపకశక్తికి ప్రతీకగా నిలుస్తున్నాయి. వంద ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకోవడం, ఈ ఫోన్ నంబర్లలో 46వ ఫోన్ నంబర్ ఎంత అని అడిగితే తడుముకోకుండా చెప్పగలిగే జ్ఞానాన్ని సొంతం చేసుకున్నాడు. క్యాలుక్యులేటర్‌లో పట్టని లెక్కలను కూడా అతి సునాయాసంగా చేసి ఆశ్చర్యపరుస్తున్నాడు. తండ్రి రాజన్, తల్లి సంధ్య, తాత య్య, నాయినమ్మలు వరదా సత్యనారాయణ, లక్ష్మిల ఆశీస్సులు పొందాడు.
Comments
Please login to add a commentAdd a comment