అలిపిరి పీఎస్ వద్ద ఉద్రిక్తత, నేతల విడుదలకు డిమాండ్
Published Sun, Aug 18 2013 9:02 AM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM
అక్రమంగా అరెస్ట్ చేసిన సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారుల నిరసన కార్యక్రమం చేపట్టడంతో తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలను విడుదల చేయాలని భారీ ఎత్తున ఆందోళనకారులు అలిపిరి వద్ద ధర్నా చేపట్టారు.
సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్ నుంచి వెళ్లి పోవాలన్న కాంగ్రెస్‌నేత వి.హనుమంతరావుకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి గాంధీగిరి పద్ధతిలో నిరసన తెలియజేయాలనుకుంటే పోలీసులు లాఠీ చార్జి చేయడంపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. వీహెచ్ కారు ఆపకుండా వెళ్లిపోతుంటే శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కారుకు అడ్డంగా పడుకుంటే పోలీసులు విచక్షణ లేకుండా దాడి చేయడం అమానుషమని అంటున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపై పోలీసుల లాఠీచార్జి కి నిరసనగా శాప్స్ నాయకులు ఆదివారం తిరుపతి బంద్‌కు పిలుపునిచ్చారు.
సమైక్యవాదులపై పోలీసుల దాడులు దారుణమని శాప్స్ నేతలు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు టీటీడీ ఏడీ బిల్డింగ్ సమీపంలోనున్న ఎస్పీ క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ శాంతియుత ఉద్యమాన్ని రాద్ధాంతం చేస్తూ సీమాంధ్రులపై హనుమంతరావు అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. దాడులు చేసే నీచ సంస్కృతి టీఆర్‌ఎస్ నేతలదేనన్నారు. తమ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించిన టీఆర్‌ఎస్ నాయకులు తెలుగు ప్రజల కోసం ఉద్యమం చేస్తున్న సీమాంధ్రులను విమర్శించే అర్హత లేదన్నారు. రెచ్చగొడితే రాయలసీమ వాసుల సత్తా రుచి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
అంతేకాక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావుపై కేసు నమోదు చేయాలని శాప్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు స్వస్థలాలకు వెళ్లిపోవాలంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసి ఉద్యమకారులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన హనుమంతరావుపై కేసు నమోదు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తను కాదని, సమైక్యాంధ్ర ఉద్యమకారుడిగా వీహెచ్‌ను అడ్డుకునేందుకు వెళ్లామని స్పష్టం చేశారు.
Advertisement
Advertisement